SIT: సిట్ ముందుకు కేసీఆర్...విచారణ ఎప్పుడంటే?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో వేగం పెంచిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్ టీం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు3 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే మున్సిపల్‌ ఎన్నికల్లో బీజీగా ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కేసీఆర్ కోరారు.

New Update
KCR

BRS chief KCR

SIT: సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో వేగం పెంచిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్ టీం అందరూ ఊహించినట్లే బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు3 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరుతూ సిట్‌ 160 సీఆర్పీసీ కింద నోటీస్‌ జారీ చేసింది. అయితే సిట్‌ నోటీసులకు స్పందించిన కేసీఆర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజీగా ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కోరారు. ఇందుకు సిట్‌కూడా అంగీకరించింది. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారం చివరిరోజు కావడంతో ఆయన మరోరోజు విచారణకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో ఈ రోజు రెండో విడత నోటీస్‌ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంతేకాక విచారణకు సిట్‌ కార్యాలయానికి వెళ్లకుండా తనను ఎర్రవల్లిలోనే విచారించాలని కేసీఆర్‌ కోరారు. దీనిపై న్యాయసలహా తీసుకుంటామని సిట్‌ అధికారులు వెల్లడించారు. 

ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌పై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో 2024 మార్చి 10న క్రైమ్‌ నంబర్‌ 243/2024తో నమోదైన కేసులో విచారణ నిమిత్తం గురువారం సిట్‌ కేసీఆర్‌కు నోటీస్‌ జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని కేసు దర్యాప్తు అధికారి పి.వెంకటగిరి సూచించారు. అయితే 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న రీత్యా తప్పనిసరిగా పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛందంగా జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కావచ్చని, కుదరని పక్షంలో హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌ పరిధిలో మరేదైనా ప్రదేశంలో విచారణ కోరవచ్చని పేర్కొన్నారు. దర్యాప్తు బృందం అక్కడికే వచ్చి విచారిస్తుందని స్పష్టం చేశారు. నోటీస్‌ ప్రతిని సిట్‌ అధికారి గురువారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన లేకపోవడంతో ఇంట్లో ఉన్న సిబ్బందికి అందించారు.

అయితే రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లు శుక్రవారమే ముగుస్తున్న కారణంగా మరో తేదీలో విచారించాలని సిట్‌ ఇచ్చిన నోటీస్‌పై కేసీఆర్‌ బదులిచ్చారు. విచారణ నిమిత్తం ఎర్రవల్లిలోని తన ఇంటికే రావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన నోటీసులోని160 సీఆర్పీసీ గురించి ప్రస్తావించారు. సాక్షిగా ఎవరినైనా విచారించేందుకు ఈ సెక్షన్‌ కింద దర్యాప్తు అధికారికి ఉన్న అధికారాల గురించి ఆయన ప్రస్థావించారు. ఈ సెక్షన్‌ ప్రకారం 65 ఏళ్లకు పైబడి వయసున్న వ్యక్తి విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని..  ఆ వ్యక్తి నివాసానికే వెళ్లి విచారించాల్సి ఉంటుందని గుర్తు ఆయన గుర్తు చేశారు. అలాగే 160 సీఆర్పీసీ నిబంధనల ప్రకారం ఆ వయసు వ్యక్తిని విచారించేందుకు ఎలాంటి పరిధి లేదని పేర్కొన్నారు. అంతేకాక ఇక మీదట ఎలాంటి నోటీసులు పంపినా ఎర్రవల్లి చిరునామాకే పంపాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, దేశ పౌరుడిగా తాను దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కేసీఆర్‌ స్పష్టం చేశారు.
 
 కాగా స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో పలువురి ఫోన్లు ట్యాప్‌ చేశారని, ఆ తర్వాత ఆధారాలను ధ్వంసం చేశారని బీఆర్‌స్‌ ప్రభుత్వపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2024 మార్చి 10న క్రైమ్‌ నంబర్‌ 243/2024తో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో  పోలీస్‌ అధికారులు ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఎస్‌ఐబీ మాజీ సీవోవో ప్రభాకర్‌రావు, ఒక న్యూస్‌ఛానల్‌ ఓనర్‌ శ్రవణ్‌రావులను అరెస్ట్‌ చేశారు.  ప్రభాకర్‌రావు ఇచ్చిన సమచారంతో బీఆర్‌ఎస్‌  కీలక నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌, సంతోష్‌రావులను సిట్‌ విచారించింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను విచారణకు పిలవడం ఆసక్తికరంగా మారింది.

Advertisment
తాజా కథనాలు