CM, మంత్రులపై తప్పుడు ప్రచారం.. SIT టీంతో రంగంలోకి దిగిన సీపీ సజ్జనార్

నారాయణపేట జిల్లా మద్దూర్‌, హైదరాబాద్‌ సీసీఎస్‌లో నమోదైన కేసులపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటుచేసింది. హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ నేతృత్వంలో 8 మందితో సిట్‌ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
CP Sajjanar

CP Sajjanar

తెలంగాణ ముఖ్యమంత్రిపై అసభ్యకరమైన పోస్టులు, అలాగే ఓ మహిళా ఐఏఎస్ అధికారిని కించపరుస్తూ తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ రెండు కీలక కేసుల దర్యాప్తు కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

నారాయణపేట జిల్లా మద్దూరులో కావలి వెంకటేష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. దీనిపై కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 11న కేసు నమోదైంది. అలాగే ఓ మహిళా ఐఏఎస్ అధికారి గౌరవానికి భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేసినందుకు ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది. దీనిపై హైదరాబాద్ సీసీఎస్‌లో రెండు తెలుగు న్యూస్ ఛానళ్లు, ఏడు యూట్యూబ్ ఛానళ్లపై కేసులు నమోదయ్యాయి. వీరిపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 75, 78, 79, 351(1), 351(2) కింద చర్యలు చేపట్టారు.

ఈ రెండు కేసుల విచారణకు ఎనిమిది మంది పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ సిట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ సారథ్యంలో నార్త్ రేంజ్ జాయింట్ సీపీ శ్వేత, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్‌తోపాటు మరో ముగ్గురు అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.


సోషల్ మీడియాలోని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, ప్రముఖుల వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై ఈ 'సిట్' కఠినంగా వ్యవహరించనుంది. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు