Naini Coal Mines : సింగరేణి కీలక నిర్ఱయం.. నైనీ కోల్ మైన్స్ టెండర్ల రద్దు

ఒడిశాలోని నైనీ బొగ్గుగని టెండర్ల నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. నైనీ కోల్ మైన్స్ టెండర్స్ విషయంలో ఇటీవల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టెండర్స్ రద్దు చేస్తున్నట్లు ఇదివరకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

New Update
FotoJet - 2026-01-22T121648.945

singareni coal mines tenders

Naini Coal Mines : ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ల నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. నైనీ కోల్ మైన్స్ టెండర్స్ విషయంలో ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో  టెండర్స్ రద్దు చేస్తున్నట్లు ఇదివరకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి ఈరోజు సాయంత్రం 5  గంటల నుండి బిడ్స్‌ ప్రారంభం కావాల్సి ఉండగా పాలనాపరమైన కారణాలతో టెండర్ రద్దు చేస్తున్నట్లు SCCL ప్రకటించడం గమనార్హం. నైనీ టెండర్ల విషయంలో సింగరేణి పాలకమండలిని కేంద్ర బొగ్గు గనుల శాఖ  ప్రశ్నించించింది.సంస్థ విధించిన నిబంధనలపై పాలకమండలి ఎందుకు చర్చించలేదన్న సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ నిలదీశారు.

ఒకవేళ చర్చించి ఉంటే టెండర్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? టెండర్ వేయదలచిన కంపెనీలకు ఎందుకు సైట్ విజిట్ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు? అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని సింగరేణి అధికారులు తెలిపారు. నిబంధనలు,టెండర్లపై పాలక మండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. 2016లో సైతం నైనీ టెండర్ల విషయంలో ఆరోపణలు రావడంతో ఇలాగే రద్ధు చేయాల్సి వచ్చింది.

తాజాగా ఏం జరిగిందంటే..

కోల్‌ లింకేజీలో భాగంగా సింగరేణికి ఒడిశా రాష్ట్రం అంగుల్‌ జిల్లాలోని నైనీ బొగ్గు గని దక్కింది. ఈ గనిలో తవ్వకాలు, బొగ్గు ఉత్పత్తి పనులకు టెండర్‌ వేసే సంస్థ విధిగా ఆ సైట్ ను సందర్శించాలి. ఆ సంస్థ బొగ్గు గనిని సందర్శించినట్లు సింగరేణి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలనే నిబంధనపై పలు విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో పలు ఆరోపణలు రావడంతో టెండర్ల ప్రక్రియను రద్ధు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలు ఏ నిబంధనలు విధించాయో వాటిపై అధ్యయనం చేసి.. తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు సింగరేణి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలతోనే సింగరేణి యాజమాన్యం టెండర్‌ ప్రక్రియను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

కాగా, నైనీ బొగ్గు గనిలో ఓవర్‌ బర్డెన్‌ (బొగ్గుపై ఉండే మట్టి, ఇతర రాళ్లు) తొలగింపు, బొగ్గు వెలికితీత, ఆ బొగ్గును తొలి విడతలో కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ (సీహెచ్‌పీ)-1, 2లకు తరలించడం, మలి విడతలో మూడో సీహెచ్‌పీకి తరలించే పనులను 25 ఏళ్ల కాలానికి గాను అప్పగించడానికి వీలుగా రూ.1604.42 కోట్లతో సింగరేణి ఈ టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా బొగ్గు బ్లాకు సమగ్ర నిర్వహణ పనులను ఎవరికైనా అప్పగించాలంటే ఓవర్‌ బర్డెన్‌ తొలగింపు, భారీ గని నిర్వహణలో పూర్వానుభవంతో పాటు బొగ్గు తరలింపునకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సామర్థ్యాలు, అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. కానీ నైనీ బొగ్గు గని విషయంలో మాత్రం విధిగా గనిని సందర్శించి, పరిసరాలను గమనించాలని, అంతేకాకుండా సింగరేణి సంస్థ నుంచి సర్టిఫికెట్‌ పొందాలనే విచిత్రమైన నిబంధన పెట్టడమే వివాదాలకు కారణమైంది. దాంతో టెండర్‌ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని సింగరేణి నిర్ణయించింది.

సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ 

కాగా  ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ సీరియస్ అయింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కుంభకోణాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి-మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని విమర్శలు గుప్పించారు.  సీఎం రేవంత్ రెడ్డి-బీజేపీకి ఎలాంటి చీకటి ఒప్పందం లేకపోతే నైని కోల్ బ్లాక్ టెండర్లపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిలో 49 శాతం వాటా ఉందని, వెంటనే దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తనవద్దనున్న ఆధారాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు.

Advertisment
తాజా కథనాలు