BRS Santosh Rao : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం..మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను విచారించిన సిట్ అధికారులు తాజాగా మాజీ ఎంపీ సంతోష్‌కు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు.

New Update
FotoJet (12)

BRS former MP Joginapally Santosh Rao

BRS Santosh Rao : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతోంది. పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా విచారిస్తున్న సిట్ అధికారులు..బీఆర్ఎస్ లోని కీలక వ్యక్తులను విచారించి వారి ద్వారా రాజకీయ కోణం కూపీలాగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను విచారించిన సిట్ అధికారులు తాజాగా  బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌కు నోటీసులు ఇచ్చారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి  సిట్‌ ఈ నోటీసులు ఇచ్చింది. రేపు(మంగళవారం, జనవరి 27వ తేదీ) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. CRPC 160 క్రింద సిట్‌ నోటీసులు జారీ చేసింది.రేపు ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.రేపు తెలంగాణ భవన్ కు రానున్న సంతోష్ రావు. తెలంగాణ భవన్ నుంచి సంతోష్ రావు సిట్ విచారణకు హాజరు కానున్నారు.

కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉండటంతో పాటు ఆయన వ్యక్తిగత, పార్టీ విషయాల్లోనూ చక్రం తిప్పిన సంతోష్ రావు పాత్రపై సిట్‌ విచారించేందుకు సిద్ధమైంది. కేసీఆర్‌ ఓఎస్డీ రాజశేఖర్‌రెడ్డిని విచారించిన సమయంలో ఆయన వెల్లడించిన అంశాలు, రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో ఇచ్చిన వివరాల ఆధారంగా సంతోష్ రావును ప్రశ్నించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నాటి సీఎం ఇంటి నుంచి కాగితంపై చేత్తో రాసిన కొన్ని ఫోన్‌ నంబర్లు తనకు అందాయని, వాటిని ఎస్‌ఐబీలోని ప్రణీత్‌రావుకు ఇచ్చి ట్యాపింగ్‌ చేయించానని రాధాకిషన్‌రావు వాంగ్మూలమిచ్చిన నేపథ్యంలో ఆ చేతిరాత ఎవరిది? ఎవరి ద్వారా ఆ స్లిప్పులు రాధాకిషన్‌రావుకు చేరాయి? ఎవరు ఆదేశిస్తే ఆ నంబర్లను పంపారనే అంశాలను తేల్చేందుకు సంతోష్ రావును విచారించరున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా సిట్-2 వేసిన విషయం తెలిసిందే. మొదటగా వేసిన సిట్ దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతోమందిని విచారించినా పెద్దగా పురోగతి కనబడలేదు. అందుకనే హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో సిట్-2ని ప్రభుత్వం నియమించింది.సిట్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే సజ్జనార్ విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే మొదట హరీష్ రావును, తర్వాత కేటీఆర్ ను విచారించారు. రేపు సంతోష్ రావును విచారించబోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో సంతోష్ రావు కూడా చక్రం తిప్పాడనే ప్రచారం తెలిసిందే. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు నీడలాగ వ్యవహరించిన కారణంగానే ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలు మొత్తం సంతోష్ కు తెలియకుండా ఉండదు అనే భావనతోనే సిట్ విచారణకు నోటీసులు జారీచేసింది. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కూడా హరీష్, సంతోష్ పైనే విమర్శలు ఎక్కుబెడుతున్నారు. దీంతో ట్యాపింగ్ విషయం సంతోష్ కు తెలియకుండా ఉండదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విచారణలో ఎలాంటి విషయాలు వెలుగుచూస్తాయో చూడాలి.

Advertisment
తాజా కథనాలు