Regional Ring Road: రింగు..రింగు..రోడ్డు....హంగులన్నీ హుష్‌ కాకి

ఎనిమిది వరుసల రోడ్డు..చమక్కున మెరిసేసెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థ..రెండు వరుసల సర్వీసు రోడ్డు..కిలోమీటరుకు ఒక వంతెన..దేశంలోనే అతి పొడవైన తొలి ఎక్స్‌ప్రెస్‌వే ..ఇదంతా రీజినల్‌ రింగురోడ్డు గురించి గొప్పగా జరిగిన ప్రచారం. అయితే ఇపుడు ఇదంతా ఉత్తదే అని తేలింది.

New Update
FotoJet - 2025-12-13T130823.439

Regional Ring Road

Regional Ring Road (RRR) : ఎనిమిది వరుసల రోడ్డు.. చమక్కున మెరిసేలా సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థ.. రెండు వరుసల సర్వీసు రోడ్డు.. ఏ చిన్న రోడ్డుకు కూడా క్రాసింగ్‌ ఇబ్బంది లేకుండా కిలోమీటరుకు ఒక వంతెన.. దేశంలోనే అతి పొడవైన తొలి ఎక్స్‌ప్రెస్‌వే రింగురోడ్డు..ఇదంతా ట్రిపుల్‌ ఆర్‌ (రీజినల్‌ రింగురోడ్డు) గురించి గత కొంతకాలంగా గొప్పగా జరిగిన ప్రచారం. అయితే ఇపుడు ఇదంతా ఉత్తదే అని తేలింది. అంతేకాదు అన్ని జాతీయ రహదారుల్లాగే దీని నిర్మాణం కాబోతుందని, రోడ్డు మీద వాహనాల రద్దీ కూడా సాధారణంగానే ఉండబోతోందని తేలింది. ఈ విషయాలను ట్రాఫిక్‌ స్టడీ తేల్చి చెప్పింది. అంతేకాదు ఎనిమిది వరుసలకు బదులు ఆరు వరుసల రింగురోడ్డుతోనే సరిపెట్టాలని కేంద్రం నిర్ణయించడం ఇపుడు చర్చనీయంశంగా మారింది. అంతేకాదు రింగురోడ్డుకు హంగులేవి లేకుండానే నిర్మించాలని నిర్ణయించడం గమనార్హం.

Also Read: కోల్‌కతాలో మెస్సీ ఫ్యాన్స్ ఫైర్.. గ్రౌండ్‌లోకి వాటర్ బాటిళ్లు విసురుతూ రచ్చ!

గతంలో  రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగం (162 కి.మీ. నిడివి)లో 204 వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో జాతీయ రహదారులు, ప్రధాన రాష్ట్ర రహదారులు క్రాస్‌ చేసే 11 ప్రాంతాల్లో భారీ ఇంటర్‌ చేంజ్‌ వంతెనలు కూడా ఉంటాయని తెలిపారు. మూసీనది మీద వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద, మంజీరానది మీద పుల్కల్‌ మండలం శివ్వంపేట వద్ద, హరిద్రా నది మీద తూప్రాన్‌ వద్ద మూడు పెద్ద వంతెనలుంటాయని ప్రచారం చేశారు.. ఇంకా వాగులువంకల మీద 105 వరకు సాధారణ వంతెనలు, పంట కాల్వలు, భవిష్యత్‌లో నిర్మించబోయే కొన్ని నీటిపారుదల శాఖ కాలువలు, చిన్న రోడ్లకు సంబంధించి 85 కల్వర్టులుంటాయని చెప్పుకొచ్చారు. ప్రతి ముప్పావు కి.మీ.కు ఒకటి చొప్పున ఏదో ఒక నిర్మాణం ఉంటుందన్న ప్రచారం చేశారు. అయితే ఇపుడు వీటిని భారీగా తగ్గించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఎన్‌హెచ్‌ఏఐని ఆదేశించి ఆశ్చర్యపరిచింది.

Also Read: తెలంగాణలో దారుణం.. భార్యను చంపి ఎస్ఐకు వీడియో.. ఆ తర్వాత తాను కూడా..!

వీటికి బదులు సగటున ప్రతి రెండు కి.మీ.కు ఒకటి చొప్పున వంతెన నిర్మించేలా డిజైన్‌ మార్చి వాటి సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీంతో వాటి సంఖ్య వంద లోపే ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి వద్ద ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో  ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రభుత్వ,ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ భేటీ అయ్యి ట్రిపుల్‌ఆర్‌ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఈ తరుణంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి ముందస్తు సమావేశం నిర్వహించి రింగురోడ్డు బడ్జెట్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది.

 ఉత్తర భాగానికి సంబంధించి భూపరిహారం, రోడ్డు నిర్మాణ వ్యయం, జీఎస్టీ, ఇతర ఖర్చులు మొత్తం కలిపి రూ.21,550 కోట్ల అంచనా వ్యయం ఉంది.  అయితే రింగురోడ్డు ఒక భాగానికి ఇంత భారీ వ్యయం సరికాదని, దీన్ని భారీగా తగ్గించాలని ఆదేశించారు. వంతెనల సంఖ్య ఎక్కువగా ఉన్నందున వాటిని కూడా  సగానికి సగం తగ్గించటం ద్వారా ఖర్చును భారీగా తగ్గించొచ్చని తేల్చి చెప్పారు. వంతెనల సంఖ్య తగ్గితే కొన్ని చిన్న రోడ్లకు రింగురోడ్డును దాటేందుకు వీలుండదు. కొన్ని ప్రాజెక్టులకు ప్రతిపాదించిన నీటి కాలువలకు కూడా ప్రస్తుతం దారి విడవాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం.

Also Read: శీతాకాలంలో జర పదిలం.. పొంచి ఉన్న 10 గుండె జబ్బులివే!

ఇవేవీ ఇక లేవన్నట్లే... 

సెంట్రల్‌ లైటింగ్‌ :  గతంలో ఔటర్‌ రింగురోడ్డు తరహాలో రీజినల్‌ రింగురోడ్డుకు రోడ్డు పొడవునా లైటింగ్‌ వ్యవస్థ ఖరారైంది. కేంద్ర కార్యదర్శి ప్రస్తుత ఆదేశంతో ఇప్పుడు దాన్ని తొలగించారు. పట్టణాలు, పెద్ద గ్రామాలు ఉన్న చోట మాత్రమే జాతీయ రహదారులపై ఉన్నట్లు సాధారణ లైటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. మిగతా చోట్ల ఎలాంటి లైట్లు ఉండవు. దీంతో మెరిసిపోవలసిన రింగురోడ్డు సాధారణ రోడ్డు తరహాలో రాత్రి వేళ చిమ్మ చీకటిగానే మిగలనుంది.

యాక్సెస్‌ పాత్‌ : తొలుత రింగురోడ్డుకు రెండు వరుసల సర్విసు రోడ్డు ఉండాలని ప్రతిపాదించారు. అయితే ప్రస్తుతం దాన్ని కూడా రద్దు చేశారు. ఆ స్థానంలో సాధారణ యాక్సెస్‌ పాత్‌ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ యాక్సెస్‌ పాత్‌ను కూడా రద్దు చేశారు.  అంటే రింగురోడ్డును ఆనుకొని ఎలాంటి రోడ్డు ఉండదు. కేవలం అంతమేర వదిలిన సాధారణ ఎగుడుదిగుడు ఖాళీ స్థలం మాత్రమే ఉంటుందన్న మాట. అందులో కనీసం కచ్చా రోడ్డు కూడా ఉండదు. వెరసి రింగురోడ్డును ఆనుకొని దిగువ గుండా వాహనాలు ముందుకు వెళ్లే వెసులుబాటు ఉండదు.

Also Read: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు.. దేశవిభజన తరువాత తొలిసారిగా..

 త్వరలో కొత్త బడ్జెట్‌ : కాగా ప్రస్తుత మార్పుల అనంతరం కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి సూచన మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఎంత వరకు బడ్జెట్‌లో కోత పెట్టొచ్చో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు లెక్కలేస్తున్నారు. మరో పదిరోజుల్లో రివైజ్డ్‌ ప్రాథమిక బడ్జెట్‌ను అందజేయాలని కేంద్ర కార్యదర్శి ఆదేశించారు. త్వరలో కొత్త లెక్కలతో మరోసారి భేటీ ఉంటుంది. దానికి ఆయన ఓకే చెబితే.. వెంటనే పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ ముందు పెడుతారు. ఆ కమిటీ ఓకే చెప్పగానే ఉత్తర రింగు టెండర్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు