Konda Surekha : కొండా శాఖపై పొంగులేటి పెత్తనం? జాతరకు దూరంగా సురేఖ

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. పొంగులేటితో ఉన్న విభేధాల మూలంగానే ఆమె జాతర ఏర్పాట్లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం సాధారణ ఎమ్మెల్యేలా అమ్మవారిని దర్శించుకున్నారు.

New Update
FotoJet (87)

Konda Surekha vs ponguleti

Konda Surekha : ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతర తొలి రోజే రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరైనప్పటికీ దేవాదాయ శాఖ కిందకు వచ్చే మేడారం జాతర పనుల రివ్యూకు మాత్రం మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడంతో మంత్రుల మధ్య విభేదాలు ఇంకా నడుస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.

 సురేఖ సొంత శాఖలోనూ స్వేచ్ఛ లేదా? అంటే అవుననే వాదన వినపడుతోంది. మంత్రి కొండా సురేఖ  దేవాదాయ శాఖపై పొంగులేటి నీడ కమ్ముకుందని, గత కొద్ది రోజులుగా ఇద్దరు మంత్రుల మధ్య సాగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం మరోసారి తెరమీదికి వచ్చినట్లు తెలుస్తోంది. మేడారం జాతరకు మంత్రి సురేఖ దూరంగా ఉండడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి కేబినెట్లో సీతక్క, సురేఖకు  అవకాశం దక్కింది. ఈ జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంచార్జీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇంచార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమపై పెత్తనం చేస్తున్నారని జిల్లా మంత్రుల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం జిల్లాలో సాగుతోంది.  మేడారం జాతరకు సంబంధించి శాశ్వత పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లతో పనులు చేపట్టింది. తమ శాఖపై పొంగులేటి పెత్తనం ఏంటని అప్పట్లోనే కొండా సురేఖ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు.  ఆ తర్వాత కూడా ఈ ఇద్దరి మధ్య గ్యాప్ కొనసాగింది. మేడారంలో పనుల పర్యవేక్షణతో పాటు సమీక్షకు కూడా కొండా దూరంగా ఉన్నారు. అదే సమయంలో కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేసిన సుమంత్  పై ఆరోపణల విషయం తెరమీదికి వచ్చింది. ఈ అంశంలో సీఎంపై కొండా కూతురు తీవ్ర ఆరోపణలు వచ్చారు. జరిగిన పరిణామాలను అప్పట్లో సురేఖ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తెచ్చారు. దీపావళి రోజున కొండా దంపతులు సీఎంను కలిశారు. అప్పట్లో ఆ వివాదానికి తెరపడింది. కానీ, మేడారంలో జరుగుతున్న పనులను మంత్రి కొండా సురేఖ పరిశీలించలేదు.

మంత్రి సీతక్క నియోజకవర్గం పరిధిలోనే మేడారం ఉంటుంది. మంత్రి పొంగులేటితో కలిసి సీతక్క మేడారం వెళ్లారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహిస్తారు. ఈ నాలుగు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈనెల 28 రాత్రి మంత్రి పొంగులేటి కుటుంబ సమేతంగా మేడారం వెళ్లారు. జనవరి 29న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.కానీ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాజాతరకు సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరి మంత్రుల మధ్య విభేదాలు ఇంకా పూర్తిగా తొలగలేదని ఈ చర్యతో అర్థమవుతోంది.

ప్రముఖులు జాతరకు వచ్చి ఆ తల్లులను దర్శించుకునే నిమిత్తం జారీ చేసే వీవీఐపీ, వీఐపీ పాస్‌ల విషయంలో సైతం ఆమెను నిర్లక్ష్యం చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు, కార్యకర్తలకు అసహనానికి గురైనట్లు సమాచారం. ఈ మేరకు మంత్రి సురేఖతో పాటు వర్గీయలు మేడారం జాతరకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు మేడారంలో నిర్వహించిన పనుల్లో నాణ్యత లేదనే ఆరోపణలున్నాయి.కోట్లు ఖర్చు పెట్టి చేసిన పనులు జాతరకు వచ్చిన భక్తులకు సరిపోవడం లేదనే విమర్శలున్నాయి. ఈ కాంట్రాక్టు పనులన్నీ కూడా తన అనుచరవర్గానికే మంత్రి కట్టబెట్టారని సురేఖ వర్గం అప్పట్లో  ఆరోపణలు చేసింది. పనుల్లో నాణ్యత లేకున్నా మంత్రి చూసీచూడనట్టుగా వ్యవహారించారని కొండా వర్గం విమర్శలు చేస్తోంది. 

జిల్లాలోని పార్టీలోని ప్రజా ప్రతినిధులను తమకు వ్యతిరేకంగా పొంగులేటి ప్రోత్సహిస్తున్నారని కొండా సురేఖ దంపతులు అనుమానిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపును పెంచిపోషిస్తున్నారనేది కొండా వర్గం భావనగా ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కొండా సురేఖ మేడారం జాతరకు దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. సురేఖను పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

అలక వీడిన సురేఖ?

ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం కొండా సురేఖ సమ్మక్క అమ్మవారిని దర్శించుకున్నారు. దేవదాయ శాఖ మంత్రిగా అక్కడే ఉండి ఏర్పాట్లు చూసుకోవలసిన సురేఖ కేవలం సాధారణ ఎమ్మెల్యేలా అమ్మవారిని దర్శించుకున్నారు.
మేడారం సమ్మక్క–సారలమ్మల జాతరలో భాగంగా మొదట గట్టమ్మ తల్లిని దర్శించుకోని, అనంతరం సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద తల్లులను దర్శించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని ప్రార్థించినట్టు కొండా సురేఖ తెలిపారు.జాతరకు తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రజాప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అయితే పొంగులేటితో విభేదాల నేపథ్యంలోనే ఆమె సాధారణ ఎమ్మె్ల్యేగా దర్శనం చేసుకున్నారు. అయితే మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో విబేధాలు పక్కన పెట్టాలని రాష్ట్ర నాయకత్వం చెప్పడంతో కొంత అలకవీడినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు