/rtv/media/media_files/2025/12/14/telangana-local-body-elections-counting-updates-2025-12-14-21-26-05.jpg)
telangana local body elections counting updates
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. బుధవారం (నేడు) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్ కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకుగాను 12 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడగా, మిగిలిన 2,569 వార్డుల్లో పోలింగ్ జరుగుతున్నాయి. మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ల సౌకర్యార్థం 6,017 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా వార్డుల్లో మొత్తం 10,719 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్లలోని 414 వార్డులకుగాను రెండు వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 412 వార్డుల్లో నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 2,174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా వార్డుల్లో 2,225 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం ఓటర్లు 52,17,413 మంది ఉండగా, వీరిలో పురుషులు 25,49,750 మంది, మహిళలు 26,67,025 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు. 16న చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు.
41,773 మంది పోలింగ్ సిబ్బంది
మున్సిపల్ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య మంగళవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నదని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వెల్లడించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు 1,379 మంది రిటర్నింగ్ అధికారులు, 41,773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్‌కాస్టింగ్ కోసం 8,191 పోలింగ్ గుర్తించామని, 16,382 బ్యాలెట్ బ్యాకులను వినియోగిస్తున్నామని, అదనపు బ్యాలెట్ బ్యాక్సులను సైతం సిద్ధంగా ఉంచామని వివరించారు.
Follow Us