Municipal Elections : రాజకీయ హంగ్ లు..అవసరాల పొత్తులు..సమీకరణాలతో జతకడుతున్న పార్టీలు

రాష్ట్రంలో మున్సిపాలిటీలకు చైర్మన్‌, మేయర్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయ సమీకరణాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి.

New Update
Telangana

Municipal Elections

Municipal Elections : రాష్ట్రంలో మున్సిపాలిటీల ఎన్నికలు ముగిశాయి. తాజాగా మరోకొన్ని గంటల్లో చైర్మన్‌, మేయర్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయ సమీకరణాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. వైరీ పక్షాలైన మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తున్నాయి. కొన్నిచోట్ల కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌–బీజేపీ, ఒక్కోచోట కాంగ్రెస్‌–బీజేపీ కలుస్తుండడం చర్చనీయంశంగా మారింది. స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళుతుండడం, మజ్లిస్, ఏఐఎఫ్‌బీలు కాంగ్రెస్‌ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతోంది. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన స్థానాలు దక్కని 36 మున్సిపాలిటీల్లో సోమవారం జరిగే మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ ద్వారా ఎంపిక జరిగే అవకాశం ఉండగా  మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్‌ కు వెళ్లనుండగా  బీఆర్‌ఎస్‌కు నాలుగైదు, బీజేపీకి ఒకట్రెండు మున్సిపాలిటీలు దక్కే అవకాశం ఉంది.
 

 మహబూబాబాద్‌: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌కు 19 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్‌ నుంచి 13, బీఆర్‌ఎస్‌ నుంచి 12 మంది గెలిచారు. సీపీఎం నుంచి గెలిచిన ముగ్గురు కాంగ్రెస్‌కు, సీపీఐ నుంచి గెలిచిన ముగ్గురు బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నారు. ఇక మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన మరో ముగ్గురి కోసం స్వతంత్రులకు అధికార కాంగ్రెస్‌ గాలం వేసింది. దీంతోఈ స్థానం కాంగ్రెస్‌ పార్టీనే దక్కించుకోనుంది. అయితే, చైర్మన్‌గా కాంగ్రెస్‌లో చేరిన ఇండిపెండెంట్‌ అయ్యే అవకాశం దక్కనుంది.

 తొర్రూరు: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌కు 9 మంది కావాలి.ఆ  9 మంది బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందారు. ఇక్కడ ఆ పార్టీకే మున్సిపల్‌ పీఠం దక్కే మెజారిటీ వచ్చింది. కానీ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిలను రంగంలోకి దింపుతోంది. ఇద్దరినీ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా నమోదు చేయించింది. దీంతో ఇరు పార్టీల బలం తొమ్మిదికి చేరింది. దీంతో  ఇక్కడ కూడా టాస్‌ తో ఫలితం తేలనుంది.  

బోధన్‌ : ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 20. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం నుంచి గెలిచిన 12 మంది మద్దతుతో ఇక్కడ కాంగ్రెస్‌ పాగా వేయనుంది.  

 కామారెడ్డి: ఈ మున్సిపాలిటీలో బీజేపీకి చెక్‌ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పావులు కదుపుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం 25 మంది సభ్యుల బలం అవసరం ఉండగా, బీజేపీకి 16 మందితో పాటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు 19, బీఆర్‌ఎస్‌ 11 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇరు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. కాంగ్రెస్‌కు చైర్మన్, బీఆర్‌ఎస్‌కు వైస్‌చైర్మన్‌ దక్కనుంది.

బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 18 కాగా, అయితే కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 14 మందిలో ఇద్దరు బీఆర్‌ఎస్‌లో  చేరడంతో ఆ పార్టీ బలం 12కు తగ్గింది. అదే సమయంలో, నలుగురు ఇండిపెండెంట్ల మద్దతుతో మళ్లీ 16కు పెరిగింది. ఇక, 14 మంది కౌన్సిలర్లు గెలిచిన బీఆర్‌ఎస్‌ పక్షాన ఇద్దరు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు చేరడంతో ఆ పార్టీ బలం కూడా 16కు చేరింది. దీంతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌లు ఈ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా కాంగ్రెస్‌ జెండానే ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్నారు.

 ఆసిఫాబాద్‌: ఈ మున్సిపాలిటీలో మ్యాజిర్‌ ఫిగర్‌ 11. ఇక్కడ కాంగ్రెస్‌కు ఏడుగురు, బీఆర్‌ఎస్‌కు 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అదే సమయంలో నలుగురు స్వతంత్రులు కాంగ్రెస్‌లో చేరడంతో  ఈ మున్సిపాలిటీ ఆ పార్టీ పరం అయ్యే అవకాశం ఉంది.

ఆదిలాబాద్‌: ఇక్కడ బీజేపీ 21 వార్డుల్లో గెలిచింది. మ్యాజిక్‌ ఫిగర్‌కు ఇంకా నలుగురు కావాలి. అయితే  బీజేపీని నిలువరించడమే కర్తవ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు కూటమి కట్టాయి. తమ పార్టీల నుంచి కాకుండా స్వతంత్రుడిని చైర్మన్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాయి. దీంతో కాంగ్రెస్‌ (11), బీఆర్‌ఎస్‌ (6), ఎంఐఎం (6)తో పాటు స్వతంత్రుల మద్దతుతో ఈ మున్సిపాలిటీ పీఠంపై ఇండిపెండెంట్‌ కు ఛాన్స్‌ దక్కనుంది.

ఖానాపూర్‌: ఈ మున్సిపాలిటీ మ్యాజిక్‌ ఫిగర్‌ 7. ఇక్కడ బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు 4 చొప్పున రాగా, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు గెలిచారు. ఒక స్వతంత్రుడు కాంగ్రెస్‌లో చేరడంతో వారి బలం 4కు చేరింది. దీంతో మూడు పార్టీల బలం సమంగా ఉంది. అయితే, ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (కాంగ్రెస్‌) నమోదు చేయించుకున్నాడు, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి ఇద్దరు కాంగ్రెస్‌ వైపునకు వచ్చారన్న ప్రచారంతో ఈ మున్సిపాలిటీ హస్తగతం  కానుంది.
భైంసా: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 14. ఇక్కడ ఎంఐఎం 12 వార్డులు గెలిచింది. కాంగ్రెస్‌ నుంచి ఒకరు కలిపితే ఆ పార్టీ బలం 13కు చేరింది.  బీజేపీ నుంచి ఆరుగురు గెలిచారు. అదే సమయంలో ఇక్కడ గెలిచిన ఐదుగురు స్వతంత్రులు బీజేపీకి మద్దతిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్‌ అఫీషియో ఓట్లతో బీజేపీ బలం కూడా 13కు చేరింది. మరో ఇద్దరు స్వతంత్రులు ఎంఐఎం వ్యతిరేక వర్గంగా ఉన్నారు. వీరు ఎవరికీ మద్దతిచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఈ ఇద్దరు స్వతంత్రులు ఎవరికి మద్దతిస్తే వారే మేయర్‌.

కాగజ్‌నగర్‌: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 16. ఇక్కడ కాంగ్రెస్‌కు 9 మంది, బీఆర్‌ఎస్‌కు 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు, స్వతంత్రులు కలిపి కాంగ్రెస్‌కు మద్దతివ్వనుండడంతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్‌ ఖాతాలోకే వెళ్లనుంది.  
 క్యాతనపల్లి: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన 12 స్థానాలకుగాను ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీఆర్‌ఎస్, సీపీఐలు కలిసి నడుస్తున్నాయి. బీఆర్‌ఎస్‌(10), సీపీఐ(4)ల మద్దతుతో ఈ స్థానం బీఆర్‌ఎస్‌ పరం కానుంది.  

 అలంపూర్‌: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌కు ఆరుగురి బలం కావాలి. బీఆర్‌ఎస్‌కు ఐదు, కాంగ్రెస్‌కు ఐదు వచ్చాయి. ఎమ్మెల్యే విజయుడు ఎక్స్‌ అఫీషియో ఓటుతో  గులాబీ జెండా ఎగరనుంది.
 

జనగామ: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 16. కాంగ్రెస్‌కు 12, బీఆర్‌ఎస్‌కు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. సీపీఎం కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తోంది. దీంతో ఆ పార్టీ బలం 13కు చేరుతుంది. నలుగురు స్వతంత్రులు గెలవగా.. ఇద్దరు బీఆర్‌ఎస్, ఒకరు కాంగ్రెస్‌ క్యాంపులో ఉన్నారు. జనగామలోనే ఉన్న మరో కౌన్సిలర్‌ కాంగ్రెస్‌కు మద్దతిస్తారు. ఇక్కడ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఎంపీ చామల కిరణ్‌ (కాంగ్రెస్‌), ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌) నమోదు చేసుకున్నారు. దీంతో ఇరు పార్టీల బలం 16కు చేరుతుంది. ఈ నేపథ్యంలో జనగామ టాస్‌ ద్వారా నిర్ఱయం అయ్యే అవకాశం ఉంది.

అలియాబాద్‌: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 11. కాంగ్రెస్‌కు 8, బీఆర్‌ఎస్‌కు 7 కౌన్సిలర్లు గెలిచారు. ఇక్కడ బీఎస్పీతోపాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్‌ క్యాంపులో చేరారు. ముగ్గురు బీజేపీ సభ్యులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లలో ఎవరికీ మద్దతివ్వడం లేదు. వారే చైర్మన్‌ పదవి అడుగుతున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను చీల్చే పనిలో కాంగ్రెస్‌ ఉంది. దీంతో ఇక్కడ ఏం జరుగుతుందో మరికొన్ని గంటల్లో తేలనుంది.

 ఎల్లంపేట: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 13. కాంగ్రెస్‌కు 8 మంది, బీఆర్‌ఎస్‌కు 12 మంది బలం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి (బీఆర్‌ఎస్‌) ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ బలం 13కు చేరనుంది. ఈ మేరకు స్పష్టత ఉన్నా, బీఆర్‌ఎస్‌లో చీలిక తెస్తున్నామని కాంగ్రెస్‌ అంటోంది. ఈ నేపథ్యంలో ఎల్లంపేట పీఠం ఎవరికి దక్కుతుందో మరికొంతసేపట్లో తేలుతుంది.

పరిగి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌కు 10 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్‌కు 8, బీఆర్‌ఎస్‌కు 8 మంది బలం ఉంది. ఇద్దరు స్వతంత్రులు చెరో పక్షం చేరారు. దీంతో ఇరు పార్టీలకు బలం సమానమైంది. ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌ (కాంగ్రెస్‌) ఎక్స్‌ అఫీషియో నమోదు చేసుకోవడంతో ఆయన ఓటుతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ వశం కానుంది.

జహీరాబాద్‌: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 19 కాగా, బీఆర్‌ఎస్‌ 15, బీజేపీ 3 కలిసినా మ్యాజిక్‌ ఫిగర్‌ రాదు. 14 మంది కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. వీరికి ఇద్దరు ఎంఐఎం, ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతివ్వనుండడంతో పాటు ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా రానుండడంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ దక్కే అవకాశం ఉంది.
 
మొయినాబాద్‌ : ఇక్కడ మున్సిపాలిటీ మ్యాజిక్‌ ఫిగర్‌ 14. ఇందులో కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 7 గెల్చుకున్నాయి. ఇక్కడ స్వతంత్రులు ఐదుగురు గెలిచారు. వీరిలో మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైనంత మంది స్వతంత్రులు కాంగ్రెస్‌ గూటికి చేరారు. వీరి సహకారంతో మొయినాబాద్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కు దక్కనుంది.

వికారాబాద్‌: ఈ మున్సిపాలిటీ మ్యాజిక్‌ ఫిగర్‌ 18 కాగా, కాంగ్రెస్‌ నుంచి 17 మంది గెలిచారు. స్వతంత్రుల మద్దతులో ఎక్స్‌ అఫీషియో ఓటు అవసరం లేకుండానే కాంగ్రెస్‌ జెండా ఎగరనుంది.  

వర్ధన్నపేట: ఇక్కడి మున్సిపల్‌ పీఠం కోసం 7గురు సభ్యుల బలం అవసరం. ఇందులో కాంగ్రెస్‌ గెలిచిన ఐదింటితోపాటు మరో స్వతంత్రుడు కలిపితే అధికార పార్టీ పక్షాన ఆరుగురు అయ్యారు. బీఆర్‌ఎస్‌ ఆరుగురు కౌన్సిలర్లను గెలిచింది. దీంతో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ఓటుతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్‌కే దక్కనుంది.
 
 కేసముద్రం: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం 9 మంది బలం కావాలి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు 8 చొప్పున స్థానాలు వచ్చాయి. ఇక్కడి నుంచి మహబూబాబాద్‌ లోక్‌సభ సభ్యుడు బలరాం నాయక్‌ ఎక్స్‌ అఫీషియో ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈయన ఓటుతో కేసముద్రం పురపాలికపై కాంగ్రెస్‌ జెండా ఎగరనుంది.  

గద్వాల: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 19. కాంగ్రెస్‌కు 16, బీఆర్‌ఎస్‌ 11, బీజేపీ నుంచి 7గురు, ఎంఐఎం నుంచి ఒక్కరు, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ బలం 19కి చేరుతోంది. అయితే, ఇక్కడ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అవగాహన కుదర్చుకున్నారు. రెండు పార్టీల బలం 18కి చేరింది. కాంగ్రెస్‌ శిబిరంలో ఉన్న ఇద్దరు స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకునేందుకు ఏకంగా చైర్మన్‌ పదవిని ఆఫర్‌ చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎంపీ మల్లురవిలు ఎక్స్‌ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. మరో ట్విస్ట్‌ ఏమిటంటే... ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 11 మందిలో పలువురు సరిత వర్గీయులే. దీంతో గద్వాల రాజకీయం ఆసక్తికరంగా మారింది.  

నారాయణపేట: ఈ మున్సిపాలిటీ మ్యాజిక్‌ ఫిగర్‌ 13. కాంగ్రెస్‌ 7, ఎంఐఎం రెండు కలిపితే 9 మంది అవుతున్నారు. బీజేపీకి 11తోపాటు ఎంపీ అరుణ ఎక్స్‌ అఫీషియో ఓటు, స్వతంత్రుడితో  ఆ పార్టీ బలం 13కి చేరింది. కానీ, ఇక్కడ బీఆర్‌ఎస్‌ (2), ఏఐఎఫ్‌బీ (1)తో పాటు ఎమ్మెల్యే పరిణికారెడ్డి ఎక్స్‌ అఫీషియో ఓటు కాంగ్రెస్‌కు వస్తే ఆ పార్టీ బలం కూడా 13కు చేరనుంది.  అనూహ్యం జరగకపోతే ఈ మున్సిపాలిటీ బీజేపీ పరమయ్యే అవకాశాలే ఎక్కువ.  

అమరచింత: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ ఆరు కాగా, మూడు ప్రధాన పార్టీలు మూడు చొప్పున గెలుపొందాయి. ఒకరు సీపీఎం నుంచి గెలిచారు. సీపీఎం కాంగ్రెస్‌కు మద్దతివ్వడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. కానీ, ఇక్కడ బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి పీఠం పంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత ఎవరు చైర్మన్‌ కావాలన్న పీఠముడి వీడితే అమరచింత బీజేపీ, బీఆర్‌ఎస్‌ కూటమిదే.  

జమ్మికుంట: ఈ మున్సిపాలిటీ మ్యాజిక్‌ ఫిగర్‌ 16 కాగా, బీఆర్‌ఎస్‌ 12 స్థానాలు గెలిచింది. ముగ్గురు స్వతంత్రులు, ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఓటుతో ఆ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నించింది. కానీ, 10 మంది కౌన్సిలర్లు గెలిచిన కాంగ్రెస్‌ పక్షానికి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఒకరు చేరడంతో బీఆర్‌ఎస్‌ బలం తగ్గింది. ఆ కౌన్సిలర్‌తోపాటు ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్‌బీ సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్‌ బలం 15కు చేరింది. అయినా మ్యాజిక్‌ ఫిగర్‌కు రెండు పక్షాలకు ఒక ఓటు తగ్గడంతో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

ఇస్నాపూర్‌: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 14 కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 12 మంది, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి (ఎక్స్‌ అఫీషియో), ఒక ఇండిపెండెంట్‌తో కలిసి మ్యాజిక్‌ ఫిగర్‌ వస్తోంది. కానీ, ఇక్కడ ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. 10 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ఒక్క కౌన్సిలర్‌ లేకపోయినా ఎంపీ రఘనందన్‌రావు ఎక్స్‌ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. ఆయన ఎవరికి ఓటు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.  

  మెదక్, నర్సాపూర్‌ : హంగ్‌ ఏర్పడిన ఈ రెండు మున్సిపాలిటీల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు అవగాహన కుదుర్చుకుంటున్నారు. మెదక్‌లో కాంగ్రెస్, నర్సాపూర్‌లో బీజేపీకి చైర్మన్‌ పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

రాయికల్‌: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 7 కాగా, బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి గెలిచిన ఆరుగురికి తోడు స్వతంత్ర అభ్యర్థి జట్టుకట్టి ఈ మున్సిపాలిటీని దక్కించుకునేలా అవగాహన కుదిరింది.  

దేవరకద్ర: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ ఏడు కాగా, కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు గెలిచారు. అదే పార్టీ రెబెల్‌ ఒకరు పార్టీలోకి వచ్చారు. బీఆర్‌ఎస్‌ నుంచి మరొకరు కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఎక్స్‌ అఫీషియో ఓటు అవసరం లేకుండా ఈ మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగరనుంది.  
ఇంద్రేశం: ఈ మున్సిపాలిటీలో మేజిక్‌ ఫిగర్‌ 10 కాగా, ఎన్నికల్లో గెలిచిన 9 మందితోపాటు స్వతంత్ర కౌన్సిలర్‌ కూడా ఒకరు మద్దతివ్వనుండడంతో అక్కడ గులాబీ జెండా ఎగరనుంది.  

 కోహిర్‌: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 9 కాగా, గెలిచిన 8 మంది కౌన్సిలర్లతోపాటు మరో ఇండిపెండెంట్, ఒక ఎంఐఎం కౌన్సిలర్‌తో కలిసి కాంగ్రెస్‌ పార్టీ ఈ మున్సిపాలిటీని దక్కించుకునే అవకాశం ఉంది.
జిన్నారం: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 11 కాగా, బీఆర్‌ఎస్‌ (8), బీజేపీ (4) మధ్య బేరసారాలు జరుగుతున్నాయి. బీజేపీకి వైస్‌ చైర్మన్‌ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.  

 మెట్‌పల్లి: ఇక్కడ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు కలిసి బీజేపీకి చెక్‌ పెడుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన 14కుగాను బీఆర్‌ఎస్‌(6), కాంగ్రెస్‌ (6)తో పాటు నలుగురు స్వతంత్రులు కలిసి పాలకమండలి ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. దీంతో 10 చోట్ల గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది.  

జగిత్యాల: మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన 26 స్థానాలకు గాను కాంగ్రెస్‌ పార్టీ 23 గెలిచింది. ఇక్కడ స్వతంత్రులుగా పోటీ చేసిన కాంగ్రెస్‌ రెబెల్స్‌ 15 మంది గెలుపొందారు. వీరికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డితో ఆ పార్టీ అగ్రనాయకత్వం చర్చలు ఫలించడంతో జగిత్యాల పీఠంపై కాంగ్రెస్‌ జెండా ఎగరనుంది.  

వేములవాడ: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 15. 13 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లకుతోడు స్వతంత్రులు, ఒక బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ కూడా తోడయ్యారు. దీంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ వశం కానుంది.

ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, వీటిలో అధికార కాంగ్రెస్‌ కేవలం ఒక్క వార్డు మాత్రమే గెలుచుకుంది. ఆరు వార్డుల్లో బీజేపీ గెలుపొందగా, బీఆర్‌ఎస్‌ 8 వార్డులు గెలుచుకుంది. అయితే బీజేపీ.కాంగ్రెస్‌కు మద్దతు పలికినట్టు విశ్వసనీయంగా తెలిసింది. చైర్మన్‌ పదవిని కాంగ్రెస్‌కు అప్పగించి, వైస్‌ చైర్మన్‌ పదవితో సర్దుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూలు ఎంపీ మల్లురవి ఎక్స్‌ అఫీషియో ఓట్లతో ఈ పీఠాన్ని ఆ రెండు పార్టీలు కైవసం చేసుకోనున్నట్టు చర్చ సాగుతోంది. 

Advertisment
తాజా కథనాలు