/rtv/media/media_files/2026/01/14/fotojet-2026-01-14t135009-2026-01-14-13-50-35.jpg)
Poisoning of dogs...600 dogs died
Poisoning of dogs : గ్రామంలో కుక్కల బెడద పెరిగితే వాటిని బంధించి ఇతర ప్రాంతాల్లో వదిలేయాల్సిన సర్పంచ్‌లు అత్యుత్సాహం ప్రదర్శించారు. మానవత్వం మంటగలిసేలా వాటిపై విషప్రయోగం చేయడంతో ఏకంగా 600లకు పైగా కుక్కలు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ విషయం బయటకు రావడంతో జంతుసంరక్షణ సంస్థలు ఆందోళనకు దిగాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదు గ్రామాల సర్పంచులపై కేసులు నమోదు చేశారు.
వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పరిధిలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందన్న నెపంతో ఏకంగా 600 కుక్కలను విషప్రయోగం చేసి చంపడం సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఐదు గ్రామాల సర్పంచ్‌లపై మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మాచారెడ్డి మండల పరిధిలోని భవానీపేట, ఫరీద్‌పేట, వాడి, పాల్వంచ, బండరామేశ్వర్ పల్లి గ్రామాల్లో గత కొన్ని రోజులుగా వీధి కుక్కల సంఖ్య పెరిగి పోయింది. దీంతో అవి గ్రామస్తులపై తరుచూ దాడులు చేస్తూ వారిని గాయపరుస్తు్న్నాయి. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్‌ల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు స్పందించారు. ఈ క్రమంలోనే కుక్కలను నియంత్రించేందుకు శాస్త్రీయ పద్ధతులు పాటించాల్సింది పోయి, మూకుమ్మడిగా విషం పెట్టి చంపాలని సర్పంచ్‌లు నిర్ణయించుకున్నారు. అలా వాటిపై విష ప్రయోగం చేయడంతో 600 వరకు కుక్కలు మృత్యువాత పడ్డాయి. ఈ విషయం ఆనోట ఈ నోట జంతు సంరక్షణ సంఘాల దృష్టికి చేరింది.
ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో కుక్కలు మృతి చెందడంపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్ట్రే ఆనిమల్ ఫౌండేషన్ (Stray Animal Foundation) ప్రతినిధులు ఐదు గ్రామాల్లో జరిగిన ఘటనపై లోతుగా విచారణ జరిపి, కుక్కలను చంపింది నిజమేనని నిర్ధారించుకుని ఆధారాలతో సహా మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ పాలకవర్గాల అండదండలతోనే ఇంతటి అకృత్యం జరిగిందని వారు ఆరోపించారు. ఈ మేరకు భవానీపేట, ఫరీద్‌పేట, వాడి, పాల్వంచ, బండరామేశ్వర్ పల్లి గ్రామాల సర్పంచ్‌లపై మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. చంపేసిన కుక్కలను గ్రామ శివారుల్లో పాతిపెట్టారనే సమాచారం మేరకు పోలీసులు, పశువైద్యాధికారులు వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు.
మరోవైపు హన్మకొండ జిల్లాలోని శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో జనవరి 6 నుంచి 8 వరకు కేవలం మూడు రోజుల్లోనే సుమారు 300 వీధి కుక్కలను విషపు సూదులు ఇచ్చి దారుణంగా చంపేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాసంస్థ ప్రతినిధి గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తం 9 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో రెండు గ్రామాల సర్పంచ్‌లు, వారి భర్తలు, ఉప సర్పంచ్, ఇద్దరు గ్రామ పంచాయతీ సెక్రటరీలు, కూలీలు కూడా ఉన్నారు. కుక్కలను చంపడానికి కూలీలను ప్రత్యేకంగా నియమించుకుని మరీ ఈ పని చేయించారని పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR)లో స్పష్టంగా పేర్కొనడం చర్చనీయంశమైంది.
Follow Us