/rtv/media/media_files/2025/10/17/pjr-2025-10-17-17-45-09.jpg)
జూబ్లీహిల్స్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు పీజేఆర్..ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒకప్పుడు జూబ్లీహిల్స్ భాగంగా ఉండేది. ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మాస్ లీడర్ గా, ప్రజలు మొచ్చిన నేతగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు పీజేఆర్. ఆయన ఇప్పుడు భౌతికంగా లేకున్నా ఎన్నికల సందర్భంలో ఆయన గురించి కచ్చితంగా చర్చ నడుస్తూనే ఉంటుంది. పీజేఆర్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన పీజేఆర్ వారసులు ఇప్పుడు ఆదిపత్యం కోసం పోరాడుతున్నారు. పీజేఆర్ వారసులు ఇద్దరూ ఇప్పుడు వేరువేరు పార్టీలో ఉంటూ తాము పనిచేస్తున్న పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను తమ భూజన వేసుకున్నారు.వీరిద్దరూ పీజేఆర్ వారసత్వాన్ని నిలుపుకుంటారా? లేదా? అనే దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
పీజేఆర్ మరణానంతరం ఆయన కుమారుడు విష్ణువర్థన్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుండి పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2023లో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
ఇక విజయా రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుండి స్వతంత్ర అభ్య ర్ధిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. అదే పార్టీ నుంచి రెండు సార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2022లో కాంగ్రెస్ లో చేరి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో ఈ అక్కా తమ్ముడు ఎప్పుడు కూడా ఎదురు పడలేదు.
పీజేఆర్ వారసుల మధ్య కూడా పోటీ
అయితే ఇప్పుడు దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ కు ఉపఎన్నిక రావడంతో ఈ అక్కా, తమ్ముడు ప్రత్యర్థులుగా మారి తమ పార్టీ తరపున ప్రచారం మొదలుపెట్టారు. బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికల బరిలో దిగిన మాగంటి సతీమణి సునీతకు పీవీఆర్ అండగా నిలబడ్డారు. పీజేఆర్ అభిమానులను, పార్టీ శ్రేణులను ఒక్క తాటి మీదకు తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ కార్పొరేటర్ విజయారెడ్డిని కలిసి తన గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఆమె వారం రోజులుగా జూబ్లీహిల్స్‌పై ఫోకస్ పెట్టారు. దీంతో ఈ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు కాకుండా.. పీజేఆర్ వారసుల మధ్య కూడా పోటీ నెలకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.