Harish Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు.. హరీష్ రావుకు బిగ్‌షాక్‌.. అనుచరులకు నోటీసులు..!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ను నిన్న సిట్‌ 7గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. త్వరలోనే హరీష్ రావుకు చెందిన ఆరుగురు ముఖ్య అనుచరులకు నోటీసులు జారీ చేయనున్నారు.

New Update
harish rao  pa arrest

Big shock for Harish Rao.. Notices to followers

Harish Rao : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT)  విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ను నిన్న సిట్‌ ఏడు గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే.  కాగా ఆయన విచారణ అనంతరం దర్యాప్తును అధికారులు మరింత వేగం పెంచారు.  కాగా,  ప్రణీత్ రావు బృందం హరీష్ రావుతో పాటు ఆయన ప్రధాన అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. దీనిపై మరింత స్పష్టత కోసం త్వరలోనే హరీష్ రావుకు సంబంధించిన ఆరుగురు ముఖ్య అనుచరులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలని సిట్ అధికారులు నిర్ణయించారు.  

 
పోలీసుల వెల్లడించిన కథనం ప్రకారం.. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని నెలల పాటు హరీష్ రావు ఫోన్ నిరంతరాయంగా ట్యాప్ చేయబడినట్లు గుర్తించారు. ఏయే తేదీల్లో, ఏయే సమయాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే వివరాలను సిట్ అధికారులు ఆధారాలతో సహా హరీష్ రావుకు వివరించినట్లు తెలిసింది. ప్రణీత్ రావు టీం ప్రత్యేకంగా హరీష్ రావు కదలికలపై నిఘా ఉంచినట్లు దర్యాప్తులో తేల్చారు. ఈ ఆధారాలను చూసిన హరీష్ రావు విచారణ సమయంలో ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులకు శ్రవణ్‌రావును ఎందుకు పరిచయం చేయించాల్సి వచ్చిందనే కోణంలో ప్రశ్నించారు. శ్రవణ్‌రావు 2023 అక్టోబరులో తన మీడియా సంస్థతో చేయించిన సర్వేలో భారాసకు 40 సీట్లు దాటడం లేదని... నిఘా విభాగం సర్వేలో మాత్రం మరోసారి అధికారంలోకి వస్తుందని ఉండటంతో ఆ అంశంపై చర్చించేందుకే వారి మధ్య సమావేశం ఏర్పాటు చేయించానని హరీశ్‌రావు చెప్పినట్లు తెలిసింది.
 
విచారణ సందర్భంగా పోలీసులు సంధించిన ప్రశ్నలకు హరీష్ రావు విభిన్నంగా స్పందించారు. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నను ఆయన ఒక పేపర్ మీద రాసుకున్నారని తెలిసింది. విచారణ జరుగుతున్న తీరుపై స్పందిస్తూ, "ఈ ప్రశ్నలు, ఆధారాలు మీరే సృష్టించారా?" అని పోలీసులను నేరుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు సాంకేతిక ఆధారాలను ముందుంచడంతో విచారణ ఆసక్తికరంగా సాగింది. ఈ కేసులో మరిన్ని రాజకీయ కోణాలు బయటపడే అవకాశం ఉండటంతో సిట్ తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 ‘హరీష్ రావు కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా.. ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చాం. ఈ కేసులో ఎవరినీ ప్రభావితం చేయొద్దని హరీష్ రావుకు సూచించాం. హరీష్ రావుకు సుప్రీంకోర్టులో స్టే రాలేదు. అవసరమైతే హరీష్ రావును మళ్లీ విచారణకు పిలుస్తాం’ అని సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో హరీశ్‌రావును త్వరలో మరోసారి విచారణకు పిలవాలని సిట్‌ నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో మరోసారి నోటీస్‌ జారీ చేయనుంది. హరీశ్‌రావును విచారించిన అనంతరం మరో ఇద్దరు ప్రముఖుల్ని విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  

Advertisment
తాజా కథనాలు