Telangana: తెలంగాణ ఇంటర్ బోర్డ్ సరికొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్ మార్చేందుకు కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం. స్టేట్ సిలబస్ స్థానంలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబ్‌సను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సిలబ్ మార్చిన పరీక్షలను మాత్రం యథావిధిగానే నిర్వహించి.. ఎన్‌సీఈఆర్‌టీలో గణితం ఒక్కటే సబ్జెక్టుగా ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గణితంను రెండుగా విభజించి 1ఏ, 1బీ, 2ఏ, 2బీలుగా అమలు చేయనుంది. జేఈఈ, సీయూఈటీ, క్లాట్ లాంటి పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు ఎక్కువగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ఆధారంగానే వస్తున్నాయని గుర్తించి మార్పులు చేయాలని నిర్ణయించింది.
ప్రైవేట్ కాలేజీల తరహాలో శిక్షణ..
ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేటు ఇంటర్ కాలేజీలు ఎన్‌సీఈఆర్‌టీ సిలబ్ అనుసరిస్తుండగా.. ఇప్పుడు ప్రభుత్వ కాలేజీ విద్యార్థులను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కృతికా శుక్లా.. నారాయణ, శ్రీచైతన్యలాంటి ప్రముఖ విద్యా సంస్థల అకడమిక్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారు అనుసరిస్తున్న బోధనా విధానాల గురించి వివరంగా తెలుసుకున్నారు. అందులో కొన్ని పద్ధతులు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రైవేటు కాలేజీల తరహాలో విద్యార్థుల ట్రాకింగ్ విధానం అమల్లోకి తేనున్నారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాలను అంచనా వేయడం దీని ప్రధాన లక్ష్యం. విద్యార్థులను ట్రాకింగ్ చేస్తూ అభ్యసన సామర్థ్యాలు పెంచాలని, ఇందులో భాగంగానే పరీక్షల విధానాన్ని సెంట్రలైజ్ చేయనున్నారు.
ఇంటర్ బోర్డు నుంచి ప్రశ్న పత్రాలు..
గతంలో యూనిట్ పరీక్షలు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలకు కాలేజీల్లోనే ప్రశ్నపత్రాలు తయారు చేయగా.. ఈ విధానంలో మాత్రం ప్రశ్న పత్రాలు ఇంటర్ బోర్డు నుంచి పంపాలని నిర్ణయించారు. అలాగే విద్యార్థుల మార్కులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి సమీక్షించనున్నారు. అలాగే సాయంత్రం కాలేజీ ముగిసిన తర్వాత కూడా గంటపాలు తరగతులు నిర్వహిస్తుండగా.. విద్యార్థుల అభ్యసనను పర్యవేక్షిస్తూ కాలేజీలకు మార్గదర్శనం చేసేందుకు అకడమిక్ గైడెన్స్, మానిటరింగ్ సెల్‌ను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఇక కాలేజీ లైబ్రరీల్లో జూనియర్ లెక్చరర్లు, వ్యాయామ విద్య బోధించే జూనియర్ లెక్చరర్లు ఈ మానిటరింగ్ సెల్స్‌లో విధులు నిర్వర్తించనున్నారు. కాలేజీల డేటాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యార్థులకు అవసరమైన గైడెన్స్ ఇస్తారు. సిలబస్ మార్పుకు అనుగుణంగా లెక్చరర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.