BRS Party: బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు చుక్కెదురైంది. నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. 15 రోజుల్లోగా పార్టీ భవనాన్ని ఖాళీ చేయించి కూల్చివేయాలని స్పష్టం చేసింది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి రూ. లక్ష జరిమానా విధించింది. ఆఫీసు నిర్మించాక అనుమతి ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ పార్టీ భవనాన్ని కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
కేవలం రూ.100లకు.. 99 ఏళ్లకు లీజ్..
నల్గొండ టౌన్ లోని హైదరాబాద్ రోడ్డు పక్కన భారీ విలువ పలికే ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కు చెందిన భూమిలోని ఎకరా స్థలాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి కేవలం రూ.100కే లీజ్ కు తీసుకుంది. ఆ తరువాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. అయితే ఈ భవనానికి మున్సిపల్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని గతంలో నుంచి నేటి వరకు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న క్రమంలో.. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చిన ఆ భవనంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
కూల్చివేయాలని మంత్రి ఆదేశాలు..
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వేళ నల్గొండలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఫోకస్ పెట్టారు. స్థానిక కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ భవనాన్ని కూల్చివేయాలని అధికారులు గతంలో ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా భవనాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం బీఆర్ఎస్ ఆఫీసు నిర్మించిన స్థలం విలువ రూ.2 కోట్ల పైమాటే అని ఆయన అన్నారు0. స్థానిక మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఆఫీసును కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో స్థానికంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నడుమ యుద్ధ వాతావరణం నెలకొన్నట్లయింది. కాగా మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్.. తాజాగా హైకోర్టు కూడా బీఆర్ఎస్ కు షాక్ ఇచేలా తీర్పు వెలువరించింది.