Hyderabad: హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతరం నేతలు రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ముత్యాలమ్మ గుడిమీద దాడి చేస్తే నిందితుడిని పిచ్చోడని ముద్ర వేసి వదిలేసే ప్రయత్నం చేశారని ఈటల మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొంతమంది చేస్తున్నారన్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు దుర్మార్గంగా లాఠీ ఛార్జ్ చేసి అరెస్టులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రదాడులకు నగరంలో ఎంతో మంది బలయ్యారన్నారు. మళ్లీ అలాంటి దాడులకే దుర్మార్గులు కుట్ర చేస్తున్నారని.. నిందితులను కఠినంగా శిక్షించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సూచించాలని గవర్నర్‌ను కోరామన్నారు. పోలీసులే మఫ్టీలో రెచ్చగొట్టి ర్యాలీలో దాడులు, లాఠీఛార్జ్ జరిగేలా చేశారని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
దాడులకు కుట్ర:
హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే సీఎం రేవంత్ ఇంత వరకు ఖండించలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం నిరంకుశ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు. హిందూ దేవాలయాల మీద దాడి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిందితుల మీద ప్రభుత్వం కేసు పెట్టకుండా ఏం చేస్తోందని ప్రశ్నించారు. వంద మంది నగరంలో దాడులకు కుట్ర చేసినట్లు తెలుస్తోందని.. రాష్ట్ర ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని నిలదీశారు. ‘‘దేవాలయాల మీద దాడి మా తల్లి మీద దాడిలా భావిస్తాం... తిప్పికొడతాం’’ అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.
దాడులపై సమగ్ర విచారణ జరపాలి:
తెలంగాణలో మందిరాలపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేశామని బీజేపీ నేతలు అన్నారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుందని ధ్వజమెత్తారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. సోమవారం డీజీపీ జితేందర్‌ను బీజేపీ బృందం కలిసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.... డీజీపీకి ఆలయాలపై దాడుల విషయం తెలిసిన ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ చేసిన హిందువులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ స్లీపర్స్ సెల్స్‌కు రాష్ట్రంలో ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇది పోలీసులకు సమాజానికి మంచిది కాదని అన్నారు. రాజకీయ అవసరం కోసం దీనిని డైవర్ట్ చేయొద్దని అన్నారు. ప్రజలే పోలీసులపై దాడి చేసినట్లు పోలీసులు కొన్ని వీడియోలు విడుదల చేస్తున్నారని ఇది కరెక్ట్ కాదని నాయకులు తెలిపారు.
ఇది కూడ చదవండి: హనీ ట్రాప్ వెనుక వైసీపీ నేతలు..? వెలుగులోకి సంచలన విషయాలు
ఇది కూడ చదవండి: కాయిల్స్‌తో ఇలా చేస్తే దోమలు కాదు మనం పోవడం గ్యారంటీ
ఇది కూడ చదవండి: నడుంనొప్పి కంటిన్యూగా వస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు
ఇది కూడ చదవండి: బంధువులు మరణిస్తే దీపావళి జరుపుకోవచ్చా?