Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికల్లో కోటిశ్వరులు..ఆ పీఠాలే లక్ష్యంగా బరిలోకి..

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 11న ఓటింగ్‌, 13న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో ఎక్కువమంది కోటిశ్వరులు ఉండటం చర్చనీయంశంగా మారింది. చైర్మన్‌, మేయర్‌ స్థానాలే లక్ష్యంగా వారు రంగంలోకి దిగారు.

New Update
FotoJet (17)

Millionaires in the municipal elections..

Municipal Elections: రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 11న ఓటింగ్‌ జరగనుండగా, 13న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో ఎక్కువమంది కోటిశ్వరులు ఉండటం చర్చనీయంశంగా మారింది. స్థానికంగా పలుకుబడి కోసమే వీరు ఎన్నికల బరిలోకి దిగుతుండగా, రాజకీయంగా రాణిస్తే తాము చేసుకునే వ్యాపారాలకు అడ్డు ఉండదనే కారణంతో చాలామంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే వాదన ఉంది. అలా పోటీ చేస్తున్నవారిలో రియల్ ఎస్టేట్‌, మైనింగ్, కాంట్రాక్టర్లు, మద్యం వ్యాపారాలు ఉండటం గమనార్హం. కాగా కోటీశ్వరులుగా ఉన్న వీరు ఎన్నికల బరిలో నిలవడంతో ఎదుటివారిని మించి ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీంతో సామాన్యులు ఖర్చును తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. కొన్ని రాజకీయ పార్టీలు సైతం అలాంటి వ్యాపారులకే టికెట్లు కేటాయించడంతో అనేక ఏండ్లుగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ పీఠాలే లక్ష్యం..

కాగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ శ్రీమంతులు కేవలం కౌన్సిలర్, కార్పోరేటర్‌ కావాలన్న ఉద్దేశంతో రంగంలోకి దిగలేదన్నది నిజం. ఆ స్థానాల్లో విజయం సాధించిన తమకున్న ఆర్థికవనరులతో చైర్మన్‌, మేయర్‌ స్థానాలను కైవసం చేసుకోవాలన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తుంది. దీంతో ఈ వ్యాపారులు ఆయా పట్టణాల్లో ఛైర్మన్‌ పీఠాలపై కన్నేశారు. అధ్యక్ష స్థానం కోసం ఆశావహులుగా ఉన్నవారితోనే ప్రధాన పార్టీలు ఎన్నికల ఖర్చు పెట్టిస్తాయి. ఆ మేరకు ఖర్చు భరించే ఆర్థిక స్తోమత ఉన్నవారిని నాయకత్వం అన్వేషిస్తున్న క్రమంలో అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని రూ.కోట్లు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు.

జిల్లాలవారిగా చూస్తే..

జిల్లాల వారిగా శ్రీమంతులు పోటీ చేస్తున్న స్థానాలు చాలానే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోని 117 స్థానాలకు 415 మంది పోటీపడుతుండగా వీరిలో 31 మంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, 4 గురు మద్యం వ్యాపారులు, 4 గురు గుత్తేదారులు, 23 మంది రైస్, పప్పు మిల్లర్ల వ్యాపారులు, 20 మంది బంగారం, ఇతర వ్యాపారాల్లో ఉన్నవారు పోటీలో ఉన్నారు. వరంగల్‌ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 1,072 మంది పోటీలోఉండగా.. వీరిలో 115 మంది రియల్టర్లు, 25 మంది మద్యం దుకాణాల నిర్వాహకులు. 20 మంది ఇసుక, మొరం వంటి మైనింగ్‌ వ్యాపారులు-, 36 మంది గుత్తేదారులు ఉన్నారు. రైస్‌ మిల్లులు, ఆభరణాలు, వస్త్ర దుకాణాల నిర్వహిస్తు్న్నవారు మరో 75 మంది వరకు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ కార్పోరేషన్‌, 17 మున్సిపాలిటీల్లో ఏకగ్రీవాలు పోను 48 డివిజన్లు, 352 వార్డులకు 1,617 మంది పోటీపడుతున్నారు. వీరిలో 110 మంది రియల్టర్లు, 17 మంది మద్యం వ్యాపారులు, 14 మంది గుత్తేదారులు, 7గురు రైస్‌మిల్లర్ల ఓనర్లు, మరో 10 మంది ఇతర వ్యాపారాలు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో మంచిర్యాల కార్పొరేషన్‌ సహా పది పురపాలక సంఘాలకు జరుగుతున్న ఎన్నికల్లో  రియల్టర్లు120 మంది, మద్యం వ్యాపారులు22మంది, మైనింగ్‌ వ్యాపారులు29మంది, కాంట్రాక్టర్లు 15మంది, ఇతర  వ్యాపారులు20 మంది ఉన్నారు.  ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో 409 వార్డులకు 1,486 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో రియల్టర్లు 90 మంది, గనుల వ్యాపారులు25మంది, మద్యం వ్యాపారులు25మంది, గుత్తేదారులు 15 మంది ఉన్నారు.  

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక కార్పోరేషన్‌, 18 మున్సిపాలిటీల్లో కలిపి 60 మంది రియల్టర్లు , 23 మంది మద్యం వ్యాపారులు, 20 మంది మైనింగ్‌ వ్యాపారులు , 28 మంది కాంట్రాక్టర్లు , 70 మంది ఇతర వ్యాపారులు పోటీ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు మరో 13 మున్సిపాలిటీలు ఉండగా  వాటిలో వీరిలో 90 మంది రియల్టర్లు, 8 మంది మైనింగ్‌ వ్యాపారులు,  12 ఇసుక వ్యాపారులు పోటీలో ఉన్నారు. ఇవే కాక హైదరాబాద్‌ శివార్లలో ఉన్న పలు కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ రియల్టర్లు, వ్యాపారులే ఎక్కువగా పోటీలో ఉన్నారు.  హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న 11 మున్సిపాలిటీల్లో మొత్తం 614 మంది పోటీలో ఉండగా వీరిలో 350 మందికి పైగా రియల్టర్లు ఉన్నారు.  దీంతో ఎన్నికల ఫలితాల అనంతరం ఆ శ్రీమంతులే చైర్మన్‌, మేయర్‌ పీఠాలను ఎంత ఖర్చుపెట్టి అయిన సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు