/rtv/media/media_files/2026/01/30/3333-2026-01-30-08-56-51.jpg)
Medaram Jathara : ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం జాతర. చుట్టుపక్కల నాలుగైదు రాష్ట్రాల గిరిజనుల, మైదానప్రజల ఆరాధ్యప్రదేశం మేడారం. రెండేండ్లకొకసారి జరిగే ఈ గిరిజనోత్సవం సాంప్రదాయిక గిరిజన ఆచారంగా గౌరవించబడుతున్నది. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజులకు గద్దెలు కట్టి జాతరచేయడానికి కారణం వాండ్లు కాకతీయులతో పోరాడి వీరమరణం పొందడమేనని కైఫీయత్తులు చెప్తున్నాయి.
గిరిజనులలో ‘అమ్మ’ దేవతారాధన అతిప్రాచీనమైనది. గిరిజనులు తమ నాయకుల్ని గౌరవాదరాలతో చూడ్డమే కాదు, వారిని అర్ధదేవతలు(Semi-Gods)గా పూజిస్తారు కూడా. వారికి ప్రత్యేకంగా అతీతశక్తులున్నాయని నమ్ముతారు. గిరిజనప్రజలు తమ పాలకులను దేవుళ్లుగా కొలువడంకూడా సాధారణమే. ప్రకృతిని ఆరాధించే గిరిజనులు వానని, పుష్పించిన అడవిని, బతుకునిచ్చే చెట్లను, నీటిచెలిమెలను, గుట్టలను, పులివంటి జంతువుల్ని దేవతలుగా కొలుస్తారు.
ముఖ్యంగా వారు మామిలి, కొమ్మలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మమ్మ, కాటురుడు, ఏడమరాజు, కుడిదేవర, ముసలమ్మలను ఆరాధిస్తారు. ఏ దేవతకు గుడిలేదు. విగ్రహాలు లేవు, మంత్రాలు లేవు. అన్నీ ప్రాకృతిక పూజలే. మరాఠా కోయలు దేవుణ్ణి ‘పేన్’ అని పిలుస్తారు, తెలుగుకోయలు ‘వేల్పుల’ని. మేడారంలో జరిగే సమ్మక్క-సారక్కల జాతర గిరిజనుల సాంప్రదాయికమే. రెండేండ్లకు ఒకసారి చేసే ఈ పండుగ వారి ఆనవాయితీ.
కాకతీయులు ఎందునాగాని ఇంత చిన్న మేడారం పరగణా మీద దాడిచేయడానికి పగిడిద్దరాజు చక్రవర్తులకు పన్ను కట్టకపోవడమన్నది కారణం అవుతుందా? కాదు. అంతకన్నా మించిన మూలకమేదో వుండివుండాలి. ప్రతాపరుద్ర చక్రవర్తి కాలంలో అతని మంత్రి యుగంధరుడి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పబడుతున్న జంపన్నవాగు యుద్ధం ఏ ప్రతాపరుద్రునికాలంలో జరిగివుంటుంది.
ఇటీవల ప్రచురించబడ్డ ‘Goddess of Folk- Sammakka and Saralamma Jatara’లోని 277వ పేజీలో పేర్కొనబడ్డ శాసనంలో ‘సమ్మక్క దేవతల ఉత్సవ.....కాకతీయ రాజ్య...కానుకలు..... బంగారము మా ప్రజల నుంచి చేర్చమని వినతి........పగిడిద్దరాజు జ్ఞా.... పౌర్ణమి కానుకలు కాకతీయ సైన్యాధిపతి ఆజ్ఞ మేరకు’ అనివుంది. ఈ శాసనమెప్పటిది. శాసనలిపి, భాషలను బట్టి మొదటి ప్రతాపరుద్రునికాలం నాటిదని గ్రంథకర్తల అభిప్రాయం. (శాసన ప్రతిబింబం లేని శాసనం. ఇటువంటి శాసనభాష ఏ కాకతీయుల శాసనంలో కన్పడలేదు. దీనిలో ఆజ్ఞ చేసినవారు కాకతీయ చక్రవర్తి కాదు. సైన్యాధిపతి పేరులేదు. ఈ శాసనం విశ్వసనీయంగా లేదు.)
ఒకవేళ మొదటి ప్రతాపరుద్రుడే ఈ యుద్ధకారకుడైతే తానే ఈ జాతరకు కానుకలు పంపమని ఎందుకు ఆజ్ఞలు చేస్తాడు. చారిత్రక ఆధారాలను వెతికితే కాకతీయ సామ్రాజ్యానికి, మేడారానికి సబబైన యుద్ధకారణాలు మనకు దొరకవచ్చు. కాకతీయ రుద్రదేవుని (1158-1195)కాలంలోనే ఈ మేడారం యుద్దం జరిగివుంటుంది.
మేడారం ప్రాంతాన్ని పాలించే సామంతుడైన(?) పగిడిద్దరాజు కప్పం చెల్లించలేకపోయినందుకు మొదటి రుద్రదేవుడు పంపించిన సేనాధిపతి గంగాధరమంత్రితో యుద్ధం చేయవలసివచ్చిందా? ఔనని ఒక కథనం. కాకతీయ సైన్యం ముందర గిరిజనసైన్యం నిలువలేకపోయింది. పగిడిద్దరాజు కుటుంబం సర్వం నిశ్శేషంగా హతమైంది. కప్పం కట్టకపోతే చక్రవర్తి పగిడిద్దరాజును బంధించవచ్చు. శిక్షించవచ్చు. కప్పం రాబట్టే విధానం యుద్ధం కాదుకదా. మరొక విధంగా కాకతీయరాజ్య విస్తరణలో భాగంగానే మేడారం రాజ్యాన్ని వశపరచుకోవడానికే రుద్రదేవుడు ఈ యుద్ధం నడిపించాడా? కావచ్చు.
కాలచురిరాజు బిజ్జలుడికి కళ్యాణీచాళుక్యరాజ్యంపై ఎప్పటినుండో ఆశవుంది. బిజ్జలుడు తన కొడుకు మైలగికి రెండవ మేడరాజు, గుండరాజు, దొమ్మరాజు, భీమదేవచోడులతో మిత్రసమాఖ్యనేర్పరచి, మూడో తైలపుణ్ణి రెండవ జగదేకమల్లున్ని సింహాసనం నుంచి తొలగించడానికి ఉసిగొలిపాడు. తైలపుడు రెండవ జగదేకమల్లుని సమర్థించే 2వప్రోలునిపై కూడా దాడి చేసాడు. రెండవప్రోలునితోపాటు మొదటి రుద్రదేవుడు, గోకర్ణదేవచోడుడు యుద్ధంలో పాల్గొన్నారు. నగునూరు ప్రభువు దొమ్మరాజు, పొలవాస రాజు మేడరాజులు కాకతీయులతో శత్రుత్వం కారణంగా అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నారు. ఈ యుద్ధంలో(క్రీ.శ. 1150 ప్రాంతంలో) దొమ్మరాజు మరణించాడు. మైలగి కళ్యాణి వరకు తరిమివేయబడ్డాడు. మేడరాజు అడవుల పాలయ్యాడు. హన్మకొండ శాసనంలో(క్రీ.శ.1163) పొలవాసరాజు, ఏడరాజు పరాజయాన్ని, పలాయనాన్ని, గుండరాజు మరణాన్ని గురించి చెప్పబడివుంది.
ఈ సందర్భంలోనే రుద్రదేవుడు మేడరాజు తన ఓటమిని అంగీకరించి, కూతురు(?) సమ్మక్కను ఇవ్వవలసిందిగా సంధి రాయబారం చేసివుంటాడు. అందుకు అంగీకరించని మేడరాజు రుద్రదేవునికి అందనంత దూరం అడవుల్లోపలికి వెళ్ళిపోయాడు.(సుంకిరెడ్డి నారాయణరెడ్డి- తెలంగాణ చరిత్ర-2011,పే.107) మేడరాజు జాడలు కనుక్కుని, మేడరాజుకు ఆశ్రయమిచ్చిన పగిడిద్దరాజు మీద గంగాధరమంత్రి చేత దాడి చేయించివుంటాడు రుద్రదేవుడు. మొదటి రుద్రదేవునికి కాకతీయరాజ్య విస్తరణకు అడ్డుగా వున్న కోయరాజ్యాన్ని లోబరచుకోవాలన్నది ఒక కారణమైతే, తనకు లొంగకుండా, అడిగినా బిడ్డనివ్వకుండా అడివిలో చేరి రాచగోండుల రాజ్యాన్ని విస్తరింప చేస్తున్నాడన్నది రెండవ కారణం.
ఇటీవలి పరిశోధనల ప్రకారం సమ్మక్కతల్లి చందంబోయిరాలు చంద్రాపూర్ రాజధానిగా రాజ్యమేలిన రాచగోండుల వంశానికి చెందిన స్త్రీ. తండ్రి రాయిబండనిరాజు మేడారం పరగణా నాయకుడు. సమ్మక్కను పెండ్లాడిన పగిడిద్దరాజు మేడరాజుకు మేనల్లుడు. తమకల్లుడైన పగిడిద్దరాజు మామ మేడరాజుకు మద్ధతుగా నిలిచారు రాచకోయలు. ఆత్మాభిమానధనులైన రాచకోయలు కాకతీయులకు లొంగడానికి, మేడరాజును అప్పగించడానికి ఇష్టపడనందువల్లనే ‘జంపన్నవాగు’ ఒడ్డున యుద్ధం జరిగింది. సమ్మక్క, సారమ్మలు యుద్ధంలోనే మరణించి వుంటారు. మేడరాజు కూడా యుద్ధంలోనే బలైవుంటాడు.
బలవంతులైన కాకతీయుల సైన్యంతో తలపడి ఆత్మసమర్పణం చేసుకున్నది ఒక గిరిజన స్వతంత్రరాజ్యం. మేడరాజు పేరుమీద గూడాలు వెలిసాయి. పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్కల పేరుమీద వీరగద్దెలు కట్టి జాతర ప్రారంభించారు మేడారం పరగణా ప్రజలు. సమ్మక్క దేవతయింది. వీరారాధన దేవతారాధనగా మార్పు పొందింది. సమ్మక్కబిడ్డలు జంపన్న, సారలమ్మలు యుద్ధంలో పాల్గొనివుంటే వారు యుక్తవయస్కులై వుండాలి. అంటే ఈ యుద్ధం 1190కి ముందో, వెనకో జరిగివుంటుంది. ఆ తరువాత 1195లో జైతుగితో యుద్దంలోనే రుద్రదేవుడు మరణించాడు.
-శ్రీ రామోజు హరగోపాల్
Follow Us