/rtv/media/media_files/2025/08/19/marwari-go-back-movement-2025-08-19-18-42-02.jpg)
Marwari Go Back Movement
Marwadi Go Back : మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా ఊపందుకుంటోంది. మార్వాడీలు ఇక్కడకు వచ్చి వ్యాపారాలు చేయడమే కాకుండా ఇక్కడి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ప్రధానంగా కొందరు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఈ ఉద్యమానికి కారణమవ్వగా దీని వెనుక రాజకీయ కోణం ఉందన్న ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. ఈ ఉద్యమం పురుడు పోసుకోవడానికి ప్రధాన కారణం ఒక మార్వాడీ తన కారును తీయమని అడిగిన తెలంగాణ యువకుడిని చితకబాదడంతోనే తలెత్తిందన్న ప్రచారం సాగుతోంది. మరో వైపు గోరెటీ రమేశ్ అనే గాయకుడు మర్వాడీలకు వ్యతిరేకంగా పాట పాడటంతో ఆయనపై మర్వాడీలు కేసు పెట్టడం, వారు ఆయనను అరెస్ట్ చేయడం ఈ గొడవకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఎక్కడి నుంచో తెలంగాణకు బతకడానికి వచ్చిన మర్వాడీలు తెలంగాణ వారిపై దాడులకు దిగుతున్నారంటూ మొదట సోషల్ మీడియాలో మొదలయిన ఉద్యమం ఆ తర్వాత వీధుల్లోకి చేరింది.
మార్వాడీలు ఇక్కడ వ్యాపారాలు చేస్తూ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో స్థానికులు ఉపాధి కోల్పొతున్నారన్న ఆరోపణలు వివవస్తున్నాయి. ఈ విషయమై ఈ నెల 18వ తేదీన వ్యాపారస్తులు ఆమనగల్లు బంద్ కు తొలుత పిలుపునిచ్చినప్పటికీ దానిని వాయిదా వేసుకున్నారు. మార్వాడీ సంఘాల నేతలతో చర్చించేందుకే బంద్ ను వాయిదా వేయనున్నట్లు ప్రకటించారు. అయితే మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటూ బతకవచ్చని, అదే సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారు కనీసం జీఎస్టీ, రాష్ట్ర పన్నులు కూడ చెల్లించడం లేదని, ఆన్ లైన్ నగదు లావాదేవీలను వారు అనుమతించడం లేదని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది.
ఇదే సమయంలో మర్వాడీ గోబ్యాక్ ఉద్యమం మరో రూపం తీసుకుంది. మార్వాడీ హఠావో తెలంగాణ బచావో పేరుతో ఈనెల 22న ఓయూ జేఏసీ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. అదే సమయంలో వైశ్యవికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు.గుజరాత్, రాజస్థాన్ నుంచి వలస వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ కుల వృత్తులను దెబ్బ తీస్తున్నారని వారు మండిపడుతున్నారు. అయితే మర్వాడీలు మాత్రం తాము ఎవరికీ అన్యాయం చేయడం లేదంటున్నారు.
బీజేపీ నుంచి దూరం చేయడానికే..
మరోకవైపు ఈ ఉద్యమం రాజకీయ రంగు పులుపుకుంటోంది. మర్వాడీలు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నందునే కాంగ్రెస్, బీఆర్ఎస్ మర్వాడీలను వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మార్వాడీలు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. పెట్టుబడులు తెచ్చే వారిని తరిమేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటున్నారని, వారికి రాజకీయం అంటగడితే ఎలా అని కమలనాధులు ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించే హక్కు అందరికీ ఉంటుందని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు.
ఇది కూడా చూడండి:Rahul Sipligunj Engagement: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. వైరలవుతున్న ఫొటోలు!