Drunk and drive: హైదరాబాద్‌లో మందుబాబుల రచ్చ.. ఒక్కరోజు రాత్రే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 2,731 మంది

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు భారీగా పట్టుబడ్డారు. 3 కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 2,731 మందిపై కేసులు నమోదయ్యాయి.

New Update
Four lakh bribe in drunk and drive case

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు భారీగా పట్టుబడ్డారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, అవగాహన కల్పించినా లెక్కచేయకుండా మద్యం సేవించి వాహనాలు నడిపిన 2,731 మందిపై కేసులు నమోదయ్యాయి.

మూడు కమిషనరేట్ల పరిధిలో..

నగరంలోని మూడు ప్రధాన కమిషనరేట్ల పరిధిలో నిన్న రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు తనిఖీలు ముమ్మరంగా సాగాయి. పట్టుబడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి:

  • హైదరాబాద్ కమిషనరేట్: 1198 మంది
  • సైబరాబాద్ కమిషనరేట్: 928 మంది

  • రాచకొండ కమిషనరేట్: 605 మంది

మొత్తంగా 2,731 మంది మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కారు. వీరి వాహనాలను సీజ్ చేసి, సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

సీపీ సజ్జనార్ వార్నింగ్

వేడుకలకు ముందే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మందుబాబులను తీవ్రంగా హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు "చక్రవ్యూహం" లాంటివని, ఇందులో చిక్కితే తప్పించుకోవడం అసాధ్యమని వారు పేర్కొన్నారు. "కొద్దిగా తాగినా పట్టుబడరని అనుకోవడం పొరపాటని, ఇక్కడ షార్ట్‌కట్స్ లేదా చాకచక్యాలు పని చేయవు" అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, పోలీసుల వార్నింగ్‌ను బేఖాతరు చేస్తూ రోడ్లపైకి వచ్చిన మందుబాబులు ఇప్పుడు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ప్రజల భద్రతే ప్రాధాన్యత

న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా, శాంతియుత వాతావరణంలో ప్రజలు వేడుకలు జరుపుకోవాలనే లక్ష్యంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తన ప్రాణంతో పాటు ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని వారు మరోసారి హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు