కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ నియమించిన కమిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. మంగళవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్న కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్.. నేడు విచారణ సైతం ప్రారంభించారు.నీటిపారుదల శాఖ మాజీ కార్యదర్శి రజత్ కుమార్ నేడు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 24 వరకు ఆయన హైదరాబాద్ లోనే ఉండనున్నారు. ఈ షెడ్యూల్‌లో మాజీ ఈఎన్‌సీలు సీ మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ బి.హరిరామ్, సీఎంవో మాజీ కార్యదర్శి స్మితా సభర్వాల్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితర అధికారులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది.
ఇది కూడా చదవండి: BIG BREAKING: పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్
వచ్చే నెలలో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావును సైతం కమిషన్ విచారించనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆ సమయంలో సీఎం కాగా.. హరీశ్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. వీరి ఆదేశాలతోనే డిజైన్లను ఖరారు చేశామని అనేక మంది అధికారులు కమిషన్ ముందు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. వీరితో పాటు ప్రస్తుత బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ, నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను సైతం విచారణకు పిలిచే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై ఈటల నుంచి కమిషన్ వివరాలను అడిగి సేకరించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ చట్టం రద్దు
ఈటల ఏం చెబుతారు?
ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల కాళేశ్వరం విచారణలో ఎలాంటి విషయాలను వెల్లడిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరో వైపు జనవరిలో కేసీఆర్ అమెరికా టూర్ కు వెళ్లడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు నెలల పాటు ఆయన అమెరికాలోనే ఉండనున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మనవడితో గడపడంతో పాటు, వైద్య పరీక్షలు చేయించుకోవడానికే కేసీఆర్ అమెరికా టూర్ కు వెళ్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే.. కేసుల నుంచి తప్పించుకోడానికే కేసీఆర్ అమెరికా వెళ్తున్నాడని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్ అమెరికా ప్రయాణానికి ముందే కాళేశ్వరానికి సంబంధించి నోటీసులు వస్తే.. ఆయన ప్రయాణం వాయిదా వేసుకనే ఛాన్స్ ఉంది.