/rtv/media/media_files/2025/11/14/naveen-yadav-profile-2025-11-14-14-32-13.jpg)
Jubilee Hills Josh in Revanth's team
Jubilee Hills By Election 2025 Results : పదేండ్ల బీఆర్‌ఎస్ పాలన తర్వాత అనుహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు మూడవ తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నవంబరు 30న జరిగాయి. ఓట్లు లెక్కింపు 2023 డిసెంబరు 03న జరిగింది.ఎన్నికల సంఘం ఫలితాలు అదేరోజు ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-64, బీఆర్ఎస్-39, బీజేపీ-8, ఎంఐఎం-7, సీపీఐ-1 ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. అయితే అదే ఉత్సాహంతో ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ఊహించిన కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. మిగిలిన 9 స్థానాల్లో 8 బీజేపీ గెలుచుకోగా ఒకటి ఎంఐఎం గెలుచుకుంది. దీంతో రేవంత్ టీం కొంత డీలా పడింది.
అయితే కంటొన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత దుర్మారణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గణేష్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో అతను గెలవడంతో కాంగ్రెస్ కు కొంత ఊరడింపు లభించినట్లయింది. ఇక ఆ తర్వాత జరిగిన జరిగిన వరుస ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాన్నే మిగిల్చాయి. 2024లో జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు మరోసారి షాక్ ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.
ఇక ఆ తర్వాత జరిగిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ కాంగ్రెస్ ఖంగు తింది. నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ - కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన చిన్నమిలే అంజి రెడ్డి విజయం సాధించారు. అలాగే నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ - కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమరయ్య విజయం సాధించడంతో కాంగ్రెస్‌లో నైరశ్యం నిండిపోయింది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని కలలు గన్న అధికార పార్టీకి కోర్టు మొట్టికాయలు వేయడంతో మరోసారి రేవంత్ కు మైనస్ మార్కులు కట్టబెట్టింది.
ఇలాంటి తరుణంలోనే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఉప ఎన్నికల అనివార్యమైంది. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించకుంటే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనే ప్రచారం నిజమేనని నమ్మాల్సి వస్తోందని భావించిన కాంగ్రెస్ ఎన్నిక కోసం తన శక్తియుక్తులను పూర్తిగా వినియోగించుకుంది. మరోవైపు ముఖ్యమంత్రిని మారుస్తారనే ప్రచారం కూడా సాగింది. ఈ తరుణంలో ఈ ఎన్నిక విజయం అనివార్యమైంది.దాని ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించుకుంది. అయితే ఈ జోష్ ఇంతటితో ఆపాలని కాంగ్రెస్ అనుకోవడం లేదు. దీన్ని మరింత వేగంగా వినియోగించుకోవాలనుకుంటోంది.దీనికోసం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంది. ఈ విజయం సాధించిన కిక్‌తో ఆ రెండు ఎన్నికలకు సిద్ధమవుతోంది. జీహెచ్‌ఎంసీ, స్థానికసంస్థల ఎన్నికలు ఎపుడు వచ్చినా విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే రెండు మూడు నెలల్లో ఈ ఎన్నికలకు అవకాశం ఉంది. అపుడు కూడా ఇదే జోష్ కొనసాగిస్తుందా? లేదా అనేది త్వరలోనే తేలనుంది.
Follow Us