/rtv/media/media_files/2025/10/26/jubilee-hills-by-election-2025-10-26-13-37-49.jpg)
Jubilee Hills by-election
Jubilee Hills by-election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వందల సంఖ్యలో నామినేషన్లు వేసినప్పటికీ అందరూ ఉపసంహరించుకోవడంతో బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా అభ్యర్థులకు తాజాగా ఈసీ ఎన్నికల సింబల్స్ కేటాయించింది. దీంతో అభ్యర్థులంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇదంతా బాగనే ఉన్నప్పటికీ తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్‍కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ గుర్తుల టెన్షన్ తప్పేలా లేదు. తాజాగా అభ్యర్థులకు ఈసీ ప్రకటించిన ఎన్నికల సింబల్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్స్ ఉండటంతో ఆ పార్టీ తలలు పట్టుకుంటుంది.
తమ పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘కారు’ను పోలిన గుర్తులు ఇతర అభ్యర్థులకు కేటాయించడం వల్ల ఓటర్లు తికమక పడుతున్నారని, దీంతో తమ ఓట్లు గల్లంతవుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా కాలంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో రోడ్డు రోలర్ (Road roller symbol), చపాతీ మేకర్ (chapati maker symbol), సోప్ బాక్స్, ట్రాక్టర్, ఆటోరిక్షా, టీవీ, కుట్టుమిషన్, షిప్, డోలీ, కెమెరాతో పాటు కారను పోలిన మరికొన్ని గుర్తులను రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనేకసార్లు విజ్ఞుప్తి చేశారు. ముఖ్యంగా వృద్ధ ఓటర్లు, దృష్టిలోపం ఉన్న ఓటర్లు ఈ గుర్తుపై తికమక పడి వేరే గుర్తుపై ఓటు వేస్తున్నారన్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గతంలో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి గుర్తుల వల్ల బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లింది కూడా. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాజాగా ఈసీ కేటాయించిన గుర్తుల్లో రోడ్డు రోలర్, చపాతీ మేకర్, కెమెరా, వంటి సింబల్స్ ఉండటంతో ఈసారి కూడా తమపార్టీకి అన్యాయం జరుగుతుందని బీఆర్‌ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఈసీ కేటాయించిన బ్యాలెట్ పేపర్‍లో మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి (కమలం), రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (చేయి), మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ (కారు) గుర్తులు కేటాయించారు. ఇక 5వ నంబర్ లో తెలుగు రాజ్యాధికార సమితి అభ్యర్థికి సోప్ డిష్, 9వ నంబర్‍లో అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థికి చపాతీ రోలర్, 13న నంబర్‍లో అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థికి రోడ్డు రోలర్, 21వ నంబర్‍లో ప్రజావెలుగు పార్టీ అభ్యర్థికి కెమెరా, 28వ నంబర్‍లో ఆల్ ఇండియా మజ్జిత్ ఈ- ఇన్ క్విలాబ్ ఈ మిలాత్ అభ్యర్థికి షిప్, 54వ నంబర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థికి టీవీ వంటి గుర్తులు కేటాయించారు. కాగా ఇవ్వన్నీ కారును పోలి ఉన్నాయి. దీంతో ఎలాగైన ఇక్కడ గెలవాలని భావిస్తున్న బీఆర్‌ఎస్ ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికార పార్టీలతో కుమ్మక్కై ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఈ గుర్తుల గండం నుంచి ఎలా బయటపడుతుందో వేచి చూడాల్సిందే.
Follow Us