Delhi blast: అది యూనివర్సిటీ కాదు..ఉగ్రవాదుల డెన్‌..ఖాళీ అవుతున్న అల్‌-ఫలా వర్సీటీ

ఢిల్లీ పేలుడు  ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉగ్ర కుట్రలో హరియాణా ఫరీదాబాద్‌లోని అల్‌-ఫలా యూనివర్సిటీ సిబ్బంది పాత్ర ఉండటం హాట్‌ టాఫిక్‌గా మారింది. ఉగ్ర కుట్రలో భాగస్వాములుగా ఉన్న వారంతా ఇదే యూనివర్సీటీకి చెందిన వారు కావడం గమనార్హం.

New Update
AL FALAH UNIVERSITY

AL FALAH UNIVERSITY

Al Falah University : ఢిల్లీ పేలుడు  ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్ర కుట్రలో  హరియాణా ఫరీదాబాద్‌లోని అల్‌-ఫలా యూనివర్సిటీ సిబ్బంది పాత్ర ఉండటంతో  ఈ విషయం మరింత హాట్‌ టాఫిక్‌గా మారింది. వైద్య వృత్తిలో ఉండి ఉగ్రదాడులకు తెగబడటం కలకలం రేపింది. ఉగ్ర కుట్రలో భాగస్వాములుగా ఉన్న వారంతా ఇదే యూనివర్సీటీకి చెందిన వారు కావడంతో యూనివర్సీటీ పేరు ట్రెండింగ్ లో ఉంది.తాజాగా మరో ఇద్దరు వైద్యులను అరెస్టు చేయడంతో విశ్వవిద్యాలయంపై మరింత నిఘా పెరిగింది. అరెస్ట్‌ అయిన ఇద్దరూ ప్రధాన నిందితుడు ఉమర్‌ నబీకి స్నేహితులని గుర్తించారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో  భద్రత కట్టుదిట్టం చేయడంతోపాటు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న వందలాది మంది విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక  ఢిల్లీ పేలుళ్ల ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ  క్రైం బ్రాంచ్‌ పోలీసులు.. హరియాణాలోని ధౌజ్‌, నుహ్‌ తదితర ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఢిల్లీ పేలుడుకు కారణమని భావిస్తున్న కారును నడిపిన డాక్టర్‌ ఉమర్‌ నబీ స్నేహితులను (మహ్మద్‌, ముస్తాకీన్‌) పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు డాక్టర్‌ కావడం గమనార్హం. మరోవ్యక్తి కూడా చైనాలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసి ఇక్కడ ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నట్లు గుర్తించారు. ఎర్రకోట సమీపంలో కారు పేలుడు సమయంలో వీరిలో ఒకడు ఢిల్లీలోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అదే సమయంలో  లుథియానాకు చెందిన ఓ వ్యక్తిని పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌ దినాజ్‌పుర్‌ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఎన్‌ఐఏ బృందం అతన్ని అదుపులోకి తీసుకుంది. మొబైల్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా అతడిని  అధికారులు గుర్తించారు.  అతన్ని విచారిస్తున్న సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే  అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద డిజిటల్‌ పరికరాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అతడు కూడా అల్‌ ఫలా విద్యార్థి కావడం.

 ఇంటిదారి పట్టిన విద్యార్థులు

ఇక అల్‌ఫలా యూనివర్సిటీ కేంద్రంగానే ఉగ్ర కుట్ర జరిగిందని భావిస్తున్న దర్యా్ప్తు బృందాలు విచారణ ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించడంతోపాటు రికార్డులను పరిశీలించడంలో నిమగ్నమయ్యాయి. అనుమానిత విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలనూ అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.ప్రస్తుతం యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులకు తీవ్ర భయాందోళనలకు గురవుతున్న విద్యార్థులు యూనివర్సిటీని వదలి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. యూనివర్సిటీలో తరగతుల కొనసాగింపుపై స్పష్టత లేకపోవడంతో తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతా ఒకే డెన్‌ నీడకు చెందినవారే..

కాగా ఢిల్లీలో పేలుడుకు కారణమైన కారును నడిపిన డాక్టర్‌ ఉమర్‌ నబీ మొదలు కొని ఇప్పటివరకు పట్టుబడ్డ నిందితులంతా ఏదో ఒక సందర్భంలో ఈ యూనివర్సిటీ సంబంధం ఉన్నవారే కావడం గమనార్హం. ఫరీదాబాద్‌ కేసులో నిందితురాలైన డాక్టర్‌ షాహీన్‌ సయీద్‌ ఈ కళాశాలలోనే పనిచేసింది. ఓ వైద్యుడు, ఎంబీబీఎస్‌ విద్యార్థితోపాటు గతంలో ఇక్కడ వైద్య విద్య అభ్యసించిన మరో డాక్టర్‌ షారూఖ్‌, డాక్టర్‌ మహ్మద్‌ ఆరిఫ్‌ మీర్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న అనేకమందికి యూనివర్సిటీతో సంబంధం ఉండటంతో ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు