HYDRA : వ్యూహం మార్చిన రేవంత్ సర్కార్.. మూసీ కూల్చివేతలపై కొత్త ప్లాన్ ఇదే!

మూసీ కూల్చివేతలపై రేవంత్ సర్కార్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. వివాదాలకు పోకుండా సాధ్యమైనంత సామరస్యంగా నిర్వాసితులను ఒప్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం.

New Update

మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందా? అమీన్ పూర్, సున్నం చెరువు, కత్వా చెరువు ప్రాంతాల్లో మాదిరిగా దూకుడుగా వెళ్లొద్దని హైడ్రాను ఆదేశించిందా? ఇప్పటికే ప్రకటించిన డబుల్ బెడ్రూంలకు మించి పరిహారం ఇవ్వాలని భావిస్తోందా? నిర్వాసితులను బుజ్జగించి పంపించాలే తప్పా.. బెదిరించి పంపొద్దన్న నిర్ణయానికి వచ్చిందా?.. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తోంది. 

సరిగ్గా.. ఆగస్టు 24న హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన హైడ్రా దూకుడు ఇటీవల అమీన్ పూర్, కూకట్ పల్లిలో చేపట్టిన కూల్చివేతల వరకు జోరుగా సాగింది. అన్ని వర్గాల వారు హైడ్రాతో పాటు ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు. హైడ్రా మా ప్రాంతంలోనూ కావాలంటూ జిల్లాల నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి. ఇటీవల ఖమ్మం, విజయవాడలో వర్షాలు కురిసిన సమయంలో హైడ్రా పేరు మరింతగా వినిపించింది. భవిష్యత్ లో ఇలాంటి ప్రకృతి వైపరిత్యాలు రాకుండా కాపాడడానికి హైడ్రా లాంటి సంస్థలు తప్పకుండా కావాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ.. గత కొన్ని రోజులుగా సీన్ రివర్స్ అయ్యింది. 

అప్పటి నుంచే వ్యతిరేకత..

మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా ఎంటర్ అయిన నాటి నుంచి కొన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఏళ్ల క్రితం స్థలం కొనుక్కొని.. అన్ని రకాల అనుమతులతో ఇల్లు నిర్మించుకున్న వారు హైడ్రా, రేవంత్ సర్కార్ పై భగ్గుమంటున్నారు. అధికారుల సర్వే, మార్కింగ్ ను అడ్డుకుంటూ వారిని వెనక్కు పంపిస్తున్నారు. జీవితాంతం కష్టపడి ఇళ్లు కట్టుకుంటే ఖాళీ చేసి పొమ్మంటారా? అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి.. మళ్లీ ఆ ప్రభుత్వాలే అవి చెల్లవు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరిచ్చే డబుల్ బెడ్రూం ఇళ్లు మాకు అవసరమే లేదని తేల్చి చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని కన్నీరు పెట్టిస్తున్నాయి కూడా..

ప్రతిపక్షాలు సైతం ఈ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించాయి. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, బీజేపీ నేత ఈటల రాజేందర్ బాధితుల తరఫున పోరాటం కూడా స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ అయితే.. బాధితుల సమస్యలు తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాల మార్కింగ్ ను ఆపేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో నిన్న సాయంత్రం నుంచి ఎక్కడా మార్కింగ్ జరగలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వాసితులతో కఠినంగా వ్యవహరించవద్దని.. బెదిరింపు దోరణిలో మాట్లాడొద్దని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఒక వేళ కోపంలో నిర్వాసితులు ఏమైనా అన్నా కూడా ఆగ్రహానికి గురికావొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. 

బఫర్ జోన్లో 8 వేల నిర్మాణాలు
మూసీ పరివాహక ప్రాంతంలో 50 మీటర్ల వరకు బఫర్ జోన్ గా గుర్తించింది ప్రభుత్వం. బఫర్ జోన్లో దాదాపు 8 వేల వరకు నిర్మాణాలు ఉన్నాయి. FTLలో 3000, రివర్ బెడ్లో మరో 2100 వరకు నిర్మాణలు ఉన్నట్లు ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో ముందుగా నదీ గర్భంలో ఉన్న వారిని సామరస్య పూర్వకంగా తరలించిన తర్వాతనే.. మిగతా నిర్మాణాల జోలికి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇందులో చాలా మంది దూర ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని ప్రభుత్వం గుర్తించింది. దీంతో స్థానికంగానే వీరికి డబుల్ బెడ్రూంలు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇంకా అవకాశం ఉన్న ప్రభుత్వ పథకాలన్నింటినీ ఆయా కుటుంబాల్లోని సభ్యులకు అందించాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇంకా నిర్వాసితుల పిల్లలను గురుకులాల్లో అడ్మిషన్లు ఇప్పించాలని కూడా అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇలా చేస్తే వారు ఖాళీ చేయడానికి ఒప్పుకుంటారని.. మిగతా వారికి సైతం ప్రభుత్వంపై నమ్మకం వస్తుందన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. 

వారికి పరిహారం పెంపు..
మూసీ పరివాహక ప్రాంతంలో చాలా మంది ఏళ్ల క్రితమే స్థలాలు కొనుక్కొని నిర్మాణాలు చేపట్టారు. 1960, 70 నుంచే ఇక్కడ చాలా మంది వెంచర్లు చేసి విక్రయాలు జరిపారు. దీంతో అనేక కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు. ప్రభుత్వాల దగ్గర అనుమతులు తీసుకుని ఇళ్లు కట్టుకున్నారు. ఇందులో చాలా మంది రెండు, మూడు ఫ్లోర్లు కట్టుకుని తాము ఉండడంతో పాటు కిరాయికి కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఒక్కో ఇంటి ధర రూ.50 లక్షల నుంచి కోటి, రెండు, మూడు కోట్ల వరకు కూడా ధర ఉంది. అలాంటి వారికి ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు మాత్రమే ఇస్తే సరిపోదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. వీరిని ఒప్పించాలంటే పరిహారం ఎక్కువగా ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారీగా పరిహారం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే పరిహారం పెంపుపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. 

రంగంలోకి టీపీసీసీ.. 
మూసీ కూల్చివేతలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండూ మూడు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై టీపీసీసీ సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ మూసీ పరివాహక ప్రాంతంలోని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో ఈ విషయాలపై చర్చించినట్లు సమాచారం. వారి సూచనలతో ప్రభుత్వానికి అందించడానికి ఓ నివేదికను టీపీసీసీ తయారు చేస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. బాధితులకు ఎంత పరిహారం ఇవ్వాలి? నిర్వాసితులను సామరస్యపూర్వకంగా తరలించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? తదితర అంశాలను ఆ నివేదికలో పొందుపర్చనున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. వారి కారణంగా ప్రభుత్వం, పార్టీకి చెడ్డ పేరు వస్తోందని టీపీసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై కూడా టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి నివేదికను అందించనున్నట్లు సమాచారం. 

Also Read :  అయిన వారే ఆగం చేస్తున్నారు.. చిన్నారులపై అఘాయిత్యాల కేసుల్లో షాకింగ్ విషయాలు!

 

#revanth-reddy #musi-river #hydra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe