హైడ్రా విషయంలో పునరాలోచనలో ప్రభుత్వం..ఇమేజ్ తగ్గకుండా జాగ్రత్తలు

తెలంగాణలో మూసీ సుందరీకరణ, చెరువుల పరిరక్షణ, హైదరాబాద్‌ అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడంపై కొంచెం ఆచి తూచి అడుగులు వేయాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజల దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకోకుండా వ్యవహరించాలని భావిస్తోంది.

New Update
BREAKING: హైడ్రా దూకుడు.. ఈరోజు కూల్చేది వాళ్లదే!

Hydra: 

హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో ఉన్న అక్రమ కట్టడాలని వరుస పెట్టి కూల్చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరి కట్టడాలను పెరికి వేస్తున్నారు. నాగార్జున లాంటి బడా యాక్టర్లు కూడా హైడ్రా బారిన పడ్డ వారే. కూల్చిన భవనాల్లో చాలావరకు రాజకీయ ప్రముఖులతో పాటు,  వీ వీఐపీలకు చెందినవి అయినా సరే రేవంత్ ఏ మాత్రం లెక్క చేయడం లేదు.ఎక్కడా రాజకీయ ఒత్తిళ్లకు  తలొగ్గకుండా హైడ్రా కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. హైడ్రా కూల్చిన వాటిల్లో కాంగ్రెస్ నేతల కట్టడాలున్నా రేవంత్ మాత్రం వాటిని కొనసాగిస్తూనే వస్తున్నారు.ఇందు కోసం హైడ్రాకు విశేష అధికారాలను సైతం కట్టబెట్టారు. హైడ్రా కూడా హైదరాబాద్‌లో చాలా వేగంగా తన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయింది. 

అయితే మొదట్లో దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజలు కూడా ప్రభుత్వం చేస్తున్న పనిని చాలా మెచ్చుకున్నారు. కానీ రాను రాను ఇప్పుడు దీని మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దాంతో పాటూ మూసీలో హైడ్రా చేసిన సర్వే చాలా కలకలం రేపింది. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఇద్దరు తమ ఇళ్ళను ఎక్కడ కూల్చేస్తారో అన్న భయంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒక మహిళ ఈ కారణంగా ఆత్మ హత్య చేసుకుంటే..మరొకరు గుండెపోటుతో మరణించారు. ఇదికాక హైడ్రా పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రేవంత్ రెడ్డి లేని పోని తలనొప్పులు తెచ్చుకున్నారని పార్టీ నేతలు అంటున్నట్టు సమాచారం. దాంతో పాటూ కొందరు అధిష్టానం పెద్దలకు కంప్లైంట్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఇక సీనియర్ నేత  మధు యాష్కీ అయితే తాను హైడ్రాకు సపోర్ట్ చేయనని పబ్లిక్‌గా చెప్పారు. తాను ప్రజలకే ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. 

మూసీ రివర్ బెడ్ ఏరియాలో జరిపిన సర్వేలో  2, 166 ఇళ్ళు ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో మూసీ నది బఫర్ జోన్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చే బాధ్యతను ప్రభుత్వం హైడ్రాకే అప్పగించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. క్కడ ఉంటున్న వాళ్లకు అవగాహన కల్పించి డబుల్‌బెడ్‌ రూం ఇళ్లల్లోకి తరలించేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. దాదాపు 80 శాతం మంది డబుల్‌బెడ్‌రూం ఇళ్లల్లోకి వెళ్లే ఛాన్స్ ఉందని.. మిగతా 20 శాతం మంది తాము చెప్పింది వినకుంటే ఎలాగైనా నచ్చజెప్పి పంపేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కానీ వీటిల్లో సామాన్యుల చిన్న ఇళ్ళ దగ్గర నుంచి పెద్దవారి ఇళ్ళు కూడా ఉన్నాయి. సామాన్యులు అయితే ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ప్రస్తుతం తాము ఉన్న దాని కంటే అది బెటర్ ఆప్షన్ కాబట్టి. అందుకే మూసీ వెంట నివాసాలు ఏర్పరుచుకున్న వారు కొందరు ప్రభుత్వం డబుల్ బెడ్రూం అందిస్తే తాము ఇక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమని ప్రకటిస్తుండగా.. ఏళ్ల క్రితమే శాశ్వత నివాసాలు కట్టుకున్న వారు.. స్థలాలు కొనుక్కొని అన్ని ప్రభుత్వ అనుమతులతో ఇళ్లు కట్టుకున్న వారు మాత్రం తాము ఇక్కడి నుంచి కదిలేదే లేదని తేల్చి చెబుతున్నారు. జీవితాంతం కష్టపడి ఇళ్లు కొనుక్కుంటే/కట్టుకుంటే ఇప్పుడు వచ్చి వెళ్లమంటే ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో ఇచ్చే డబుల్ బెడ్రూం ఇళ్లు తమకు అవసరమే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంగానే మూసీనది దగ్గర హైడ్రా సర్వే చేయడానికి వచ్చినప్పుడు పెద్ద గొడవ జరిగింది. ఈ చర్యతో హైడ్రాను ఇప్పుడు దాదాపు అందరూ వ్యతిరేకిస్తున్నారు.ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కూడ అయ్యాయి. మరోవైపు హైడ్రాకు తెలంగాణ హైకోర్టు సైతం చివాట్లు పెట్టింది.చార్మినార్‌‌ను కూడా కూల్చేస్తారా అంటూ మండిపడింది. ప్రభుత్వ  ఆస్తుల సంరక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. 

దీంతో హైడ్రాకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. దాంతో పాటూ ఇప్పుడు దీని విషయంలో కాస్త ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుండడం అంత మంచి విషయం కాదని అనుకుంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్ కు పట్టం కట్టారు ప్రజలు. ఇప్పుడు హైడ్రా విషయంలో తగ్గకపోతే మొదటికే మోసం వస్తుందని అనే ఆలోచనలో పడింది ప్రభుత్వం. దీంతో పాటూ అధిష్టనం కూడా హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హచ్చరించినట్టు తెలుస్తోంది. పౌరుల హక్కులను హరించి వారిని రోడ్డుపాలు చేసేలా అమానవీయంగా వ్యవహరించొద్దని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా అధికార కొరడాను సామాన్యులపై ఝళిపించవద్దని ఏఐసీసీ పెద్దలు సూచించినట్టు సమాచారం. అందుకే ఇప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా హైడ్రా విషయంలో కాస్త తగ్గాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. తాత్కాలికంగా ఇచ్చిన బ్రేక్‌ను మరి కొన్ని రోజులు పొడిగించాలని కూడా భావిస్తోంది. తరువాత కూడా వేటిని తొలగించాలి, వేటిని వద్దు అనే విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. 

Also Read: Hyderabad: అదానీ, పొంగులేటి డీల్.. రహస్య చర్చలు

Advertisment
Advertisment
తాజా కథనాలు