HYD Rain: హైదరాబాద్ లో హై టెన్షన్.. వరదల్లో మరొకరు మృతి.. డేంజర్ లో ఆ కాలనీలు!

హైదరాబ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వరుణ దేవుడు బీభత్సం సృష్టించాడు.

New Update

HYD Rain: హైదరాబ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వరుణ దేవుడు భీభత్సము సృష్టించాడు. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పాతం నమోదైంది.  ముషీరాబాద్‌లో 18 సెం.మీ,  సికింద్రాబాద్‌లో 14 సెం.మీ, హిమాయత్‌నగర్‌లో 12 సెం.మీ వర్షం పాతం నమోదైంది. భారీ వర్షానికి  రోడ్లు చెరువులను తలపించాయి. వరద నీటి ప్రవాహంతో డ్రైనేజీలు, కాలువలు పొంగిపొర్లాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూసుఫ్‌గూడ కృష్ణానగర్ బి బ్లాక్‌లో వరద నీటి  ప్రవాహంతో  వాహనదారులు, స్థానికులు నానా అవస్థలు పడ్డారు. పలు చోట్ల వరద నీటి ప్రవాహానికి ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోయాయి. 

వరదల్లో వ్యక్తి మృతి

వరద నీటి ప్రభావంతో హైదరాబాద్ లోని  పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు  ఇప్పటికే నీట మునిగిపోయాయి. దీంతో  ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.  వారాసిగూడ, మెట్టుగూడ, ఈస్ట్‌ మారేడ్‌పల్లి అంబేద్కర్‌ నగర్‌,రామ్‌గోపాల్‌ పేట్‌లోని బస్తీలు, చిల్కలగూడ,  మియాపూర్‌ దీప్తిశ్రీ నగర్‌లో ప్రాంతాల్లో  ఇళ్లలోకి వరద నీరు చేరింది.

ఈ క్రమంలో బల్కంపేట ప్రాంతంలో ఓ వ్యక్తి వరద నీటిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ఇదిలా ఉంటే రెండు రోజుల కిందట కురిసిన వర్షానికి హబీబ్ నగర్ లోని ఆఫ్జాల్ సాగర్ కాలువలో మామ అల్లుళ్ళు కొట్టుకుపోయారు. మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా కొట్టుకుపోయాడు. అయితే  ఆఫ్జాల్ సాగర్ నాలా దాటుతుండగా మామ అందులో పడిపోయాడు. దీంతో మామను కాపాడడానికి వెళ్లి అల్లుడు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు సమాచారం. వీరిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరూ కూడా 30 సంవత్సరాల లోపు ఉన్నవారేనని తెలుస్తోంది. 

అలాగే, ముషీరాబాద్ లో మరో యువకుడు గల్లంతయ్యాడు. ఇతడిని ముషీరాబాద్ డివిజన్ వినోబా కాలనీకి చెందిన సన్నీ యువకుడిగా గుర్తించారు. స్థానికంగా ఉన్న నాళా  పక్కన గోడపై కూర్చొని స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా గోడ కూలిపోయింది. దీంతో ఆ యువకుడు నాళాలో పడి కొట్టుకుపోయాడు. వెంటనే అతడి స్నేహితులు కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సహక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ, నీరు నిలిచిపోయిన చోట్ల పోలీస్‌, ట్రాఫిక్‌, హైడ్రా విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో  హైడ్రా, డీఆర్‌ఎఫ్‌లు ప్రజలకు సహాయం చేయడానికి హెల్ప్‌ లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశాయి. సహాయం కోసం 9000113667, 9154170992,  040 29560521 నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. 

Also Read: Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. రాష్ట్రంలో నేడు దంచికొట్టనున్న వర్షాలు!

Advertisment
తాజా కథనాలు