GHMC: గ్రేటర్ హైదరాబాద్ వాటర్ బోర్డులో భారీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. కోటికి పైగా జనాభా కలిగివున్న నగరంలో సరఫరా చేస్తున్న నీటికి, వచ్చే ఆదాయానికి పొంతన లేదని మెట్రో వాటర్ బోర్డ్ అధికారులు పలు లెక్కలను బయటపెట్టారు. కమర్షియల్ కలెక్షన్లకు లెక్కా పత్రం లేదని, లక్షన్నర కమర్షియల్ కలెక్షన్లకు 54 వేలు మాత్రమే రికార్డుల్లో ఉన్నట్లు తెలిపారు. కొంతమంది అధికారులు లంచాలకోసం డొమెస్టిక్ కేటగిరీలో మార్చినట్లు చెప్పారు.
రూ.100 కోట్లు దాటట్లేదు..
ఈ మేరకు నగరంలో రోజుకు 500 ఎంజీడీలకు పైగా నీటిని సరఫరా చేస్తున్నాం. దీని ప్రకారం వాటర్ బోర్డుకు నెలకు రూ.230 కోట్ల ఆదాయం రావాలి. కానీ రూ.90 నుంచి రూ.100 కోట్లు దాటట్లేదు. కరెంట్ బిల్లు రూ.130 కోట్లు కడుతున్నాం. జీతాలకు రూ.70 కోట్లు, ఉచిత నీటి సరఫరా కోసం రూ. 20 కోట్లు కేటాయిస్తున్నాం. దీంతో నెలకు రూ.130 కోట్లు అప్పు అవుతుండగా ఇప్పటివరకూ రూ.5,100 కోట్ల అప్పు పెరిగిపోయింది. దీంతో ఇకపై వాటర్ బోర్డు ఆదాయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వాటర్ బోర్డ్ సంస్థ ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు..
ఇక గ్రేటర్ పరిధిలో పరిశ్రమలు, పెద్ద ఇనిస్టిట్యూట్, మల్టీ బిజినెస్ బిల్డింగ్స్, విల్లాలు, హోటళ్లు, కమర్షియల్ కేటగిరీ కిందకు వస్తాయని తెలిపారు. అయితే ఇవన్నీ కూడా డొమెస్టిక్ క్యాటగిరీ కింద ఉన్నట్లు తెలిసి షాక్ అయ్యామన్నారు. దీంతో వెంటనే అధికారులు సమగ్రంగా సర్వే చేసి డొమెస్టిక్, కమర్షియల్ యాక్టివిటీ కనెక్షన్లను గుర్తించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించి అందులో డేటాను పొందుపరచాలన్నారు. జీహెచ్ఎంసీ నుంచి ఆస్తి పన్ను డేటా సేకరించి సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. కలెక్షన్ల విషయంలో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లక్ష కనెక్షన్లు డొమెస్టిక్ ముసుగులో..
ప్రస్తుతం13.80 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అందులో10 లక్షలు డొమెస్టిక్ కలెక్షన్స్ ఉన్నాయి. వీటిలో అంగులం పైపులు 54 వేలు ఉన్నాయి. లక్ష కనెక్షన్లు డొమెస్టిక్ ముసుగులో ఉన్నట్లు గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో కనెక్షన్ల కోసం వచ్చే వారి నుంచి కొందరు కిందిస్థాయి అధికారులు, సిబ్బంది లంచాలు తీసుకుని అక్రమ కనెక్షన్లను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం ఉంది. ఆయా సెక్షన్ల పరిధిలో అవినీతికి పాల్పడుతున్న వారిని కట్టడి చేసేందుకే ప్రస్తుతం డివిజన్ల వారీగా కనెక్షన్ల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు సర్వే ప్రారంభించినట్లు అశోక్ రెడ్డి వెల్లడించారు.