/rtv/media/media_files/2024/12/29/PsM7Z8snev4gCbqCpQWv.jpg)
December 31 New Year Celebrations
Drunk driving Hyderabad: వచ్చేది న్యూఇయర్...కొత్త సంవత్సరం అనగానే మందు, విందు ఎంజాయ్ చేద్దామనుకుంటారు. అందుకే తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం విక్రయాలను డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించింది ప్రభుత్వం. కానీ మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగర వాసులకు పలు హెచ్చిరికలు జారీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా, పది వేల రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు ప్రారంభించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ తనిఖీలు డిసెంబర్ 31వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు. నగరంలో 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు ఉంటాయని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు.
కాగా సజ్జనార్ చెప్పినట్లే తొలిరోజే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో 304 మంది పట్టుబడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి 304 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా వారిని అదుపులోకి తీసుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం పబ్‌లకు వెళ్లే వారు తమ డ్రైవర్లను వెంట తీసుకెళ్లాలని కమిషనర్ సూచించారు. లేదంటే క్యాబ్ బుక్ చేసుకుని ప్రయాణించాలని సూచించారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా సెలబ్రేషన్స్ చేసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
బుధవారం అర్ధరాత్రి సీపీ సజ్జనార్ బంజారాహిల్స్‌లోని టీజీ సర్కిల్ వద్ద డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను స్వయంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులకు సీపీ క్లాస్ తీసుకుని, డ్రంకన్ డ్రైవింగ్ వల్ల జరిగే అనర్థాలను వివరించారు. నగర రహదారుల పై డ్రంకన్ డ్రైవింగ్‌ను ఏమాత్రం సహించబోమని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
అయితే నూతన సంవత్సర వేడుకలు ప్రజల జీవితాల్లో తీపి జ్ఞాపకాలుగా మిగలాలే తప్ప, చేదు అనుభవాలుగా మారకూడదని సీపీ హితవు పలికారు. డిసెంబరు 31 రాత్రి పబ్‌లు, త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నిబంధనలు కచ్చితంగా పాటించాలని, డెసిబెల్స్ పరిమితి దాటితే సౌండ్ సిస్టమ్‌లను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఈవెంట్లలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని, అలాంటి వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. వేడుకల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సీపీ వివరించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్‌లలో మఫ్టీలో 15 షీ టీమ్స్ నిఘా ఉంచుతాయని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తక్షణమే అరెస్టు చేస్తామని వెల్లడించారు.
Follow Us