Khairatabad Ganesh 2024 :
హైదరాబాద్ లో గణనాథుల సందడి నెలకొంది. వీధి వీధిలో గణేషుడి విగ్రహాలతో సిటీ అంతా కోలాహలంగా మారింది. భారత దేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ మహా గణనాథుడు ఈ సంవత్సరం సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో కొలువుదీరాడు. ఖైరతాబాద్ గణేషుడి ఉత్సవాలు మొదలై ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. 70 అడుగులతో సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఖైరతాబాద్ కు పోటెత్తిన భక్తులు
ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణనాథుడి దర్శనానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. సెప్టెంబర్ 17న మంగళవారం రోజున మహా గణపతి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పేరు గాంచిన ఈ మహా గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వీకెండ్స్ తో కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఖైరతాబాద్, లక్డికపుల్ మెట్రో స్టేషన్లలో జనాలు కిటకిటలాడుతున్నారు. ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. 70 అడుగుల ఎత్తు, 7ముఖాలు, 24 చేతులతో ఆకాశాన్నంటేలా ముస్తాబైన మహా గణనాథుడి రూపం భక్తులను మైమరిపిస్తోంది.