/rtv/media/media_files/2025/10/30/azharuddin-2025-10-30-09-27-20.jpg)
Azharuddin
Telangana Cabinet : ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నిక, మరోవైపు స్థానిక ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు కీలకంగా మారిన నేపథ్యంలో అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా వారిని మచ్చిక చేసుకోవాలని భావిస్తోంది. నిన్నటి మొన్నటి వరకు తమ గెలుపు నల్లేరు మీద నడక అని భావించిన కాంగ్రెస్ పార్టీకి జనంలో వస్తున్న వ్యతిరేకత, మైనారిటీల మద్దతు లేకపోవడంతో వారిని తమవైపు తిప్పుకోవడానికి ఇంతకు మించి మార్గం లేదని భావిస్తోంది.ఈ క్రమంలో రెండు రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ చేయాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నికల్లో నవీన్‌యాదవ్ కు టికెట్ ఇవ్వడం ద్వారా అంగబలం, అర్థబలం కలిసివస్తుందని భావించిన కాంగ్రెస్ ఆ రెండు ఉన్నప్పటికీ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర వ్యతిరేకతతో గెలవలేమనే భయం పట్టుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం ఆశనీపాతంలా తయారైంది. మహిళలకు రూ.2500, ఇతర పెన్షన్లు రూ.4000లకు పెంపు వంటివి అమలు కాకపోవడం, ఉచిత బస్సుతో ఆటోడ్రైవర్ల ఉపాధి కోల్పోవడం, హైడ్రాతో సామాన్యుల ఇండ్ల కూల్చివేత, బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడం వంటివి ప్రభుత్వానికి వ్యతిరేక ఓటుబ్యాంక్‌గా మారినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల సినిమా కార్మికుల ఓట్లను దక్కించుకోవాలని చేసిన ప్రయత్నం కూడా బెడిచికొట్టడంతో మైనారిటీ ఓటుబ్యాంక్ పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఆ క్రమంలోనే అజారుద్దీన్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందన్న ప్రచారం సాగుతోంది.
క్యాబినెట్ ప్రక్షాళన
జూబ్లీహిల్స్ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. మంత్రివర్గంలో మరో ముగ్గురికి అవకాశం ఉండటంతో ఒకటి అజారుద్దీన్‌కు కేటాయించినా మరో ఇద్దరికీ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో తనకు సహాకరించని ముగ్గురు మంత్రులను బర్తరఫ్ చేయాలని కూడా ఆయన భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారా లేక, స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆగుతారా అనేది స్పష్టత లేనప్పటికీ ముగ్గురు మంత్రులకు మాత్రం ఉద్వాసన తప్పదనే ప్రచారం సాగుతోంది. పనితీరు సరిగా లేదనే కారణంతో మంత్రులను పక్కన పెట్టి, వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడంతో ఇంకా రెండు స్థానాలు ఖాళీగా ఉంటాయి. ఆ రెండింటితో పాటు బర్తరస్ చేసిన ముగ్గురి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పనితీరు సరిగా లేని మంత్రులను పక్కన పెడతారని ప్రచారం ఉంది. కొంత మంది మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరి కొందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మంత్రుల అనుచరులు, బంధువుల ఆగడాలు కూడా మితిమీరినట్లు ప్రచారం సాగుతోంది. అందుకే వారిని తప్పించేందుకు అధిష్టానం సీఎంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇద్దరు బీసీ వర్గానికి చెందిన మంత్రులు, ఇద్దరు ఓసీ వర్గానికి చెందిన మంత్రులను తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి వర్గం నుంచి బయటికి వచ్చిన వారికి పార్టీ పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక ఖాళీ అయిన వారి స్థానంలో ముఖ్యమంత్రికి నమ్మకస్తులతో పాటు అధిష్టానం ఆదేశాలను అమలు చేసేవారికి అవకాశం దక్కనుందని తెలుస్తోంది. కాగా. ఆ అదృష్ట వంతులు ఎవరనేది త్వరలోనే తేలనుంది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు!
Follow Us