Hyderabad : హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం..కీలక ఫైళ్లు దగ్ధం

హైదరాబాద్​ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్‌ ల్యాబ్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ల్యాబ్‌ నుంచి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్‌లో తొలుత మంటలు చెలరేగి భవనానికి వ్యాపించాయి.  

New Update
FotoJet (2)

Hyderabad Forensic Lab Fire

Hyderabad Forensic Lab Fire : హైదరాబాద్​ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్‌ ల్యాబ్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ల్యాబ్‌ నుంచి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్‌లో తొలుత మంటలు చెలరేగి భవనానికి వ్యాపించాయి.  అయితే ఉదయం పూట కావడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయంలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణంగా తెలుస్తోంది. ఘటనాస్థలికి నార్త్‌జోన్‌ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కాగా ల్యాబ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్ర కలకలం చెలరేగింది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో భవనం మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది.  అయితే, తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడంతో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ల్యాబ్ లోనే పలు కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు  గల ఫైళ్లు ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ కంప్యూటర్లోనే కీలక కేసులు సమాచారం ఉన్నట్లు తెలిసింది. ఇక్కడే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు తెలుస్తుంది. రేవంత్‌ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు ఆడియో, వీడియో ఫైల్స్ కూడా ఇక్కడే ఉన్నట్లు సమాచారం. ఫస్ట్ ఫ్లోర్ లో కంప్యూటర్ ల్యాబ్ తో పాటు కీలకమైన గదులు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కీలక ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లోనే పలు కేసుల్లో సేకరించిన పేపర్ వర్క్ ఎవిడెన్స్ సైతం ఇందులోనే ఉన్నాయి. పొగలు పూర్తిగా అదుపులోకి వస్తేనే ఎంత వరకు నష్టం వాటిల్లిందో తెలిసే అవకాశం ఉంది.

కాగా మంటలు చెలరేగిన సమయంలో అక్కడే ఉన్న ఒకరిద్దరు సిబ్బంది వాటిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. అయితే పొగ దట్టంగా అలుముకోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. కాగా మంటలను అదుపు చేసే క్రమంలో సిబ్బందిలో ఒకరు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు.

కుట్రకోణం

కాగా తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ అగ్నిప్రమాదంలో కుట్రకోణం దాగి ఉందన్న ప్రచారం సాగుతోంది. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు ఈ తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.  అగ్నిప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం.ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉంటాయి. అవి దగ్ధమయ్యాయా లేదా సురక్షితంగా ఉన్నాయా అనే సమాచారం లేదు. పలు కేసులకు సంబంధించిన కీలక పత్రాలను మాయం చేసే ఉద్ధేశంతోనే పైళ్లను దగ్ధం చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న  సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిస్థితిని సమీక్షించారు.5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు పూర్తిగా అదుపు చేసామని,  ప్రమాదం జరిగినప్పుడు నలుగురు ఉద్యోగులు లోపల ఉన్నారని ఆమె తెలిపారు. మంటలు గమనించి వారు సురక్షితంగా బయటికి వచ్చారని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి  తెలిపారు.

Advertisment
తాజా కథనాలు