/rtv/media/media_files/2026/01/12/fotojet-2026-01-12t072547-2026-01-12-07-26-12.jpg)
Reorganization of districts
Reorganization of districts : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించింది. అయితే పన్నేండేండ్ల తర్వాత తిరిగి జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత లోపించిందనే కారణాలతో తిరిగి జిల్లాలను విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే క్రమంలో 33 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా కుదించాలని కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలను సైతం విభజించారు. అయితే 2022 వరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో కొన్నిచోట్ల పరిపాలన, జోన్లు, స్థానిక వెసులుబాటు పరంగా సమస్యలు ఉన్నాయంటూ ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా నియోజకవర్గాలు ఒకటికి మించి రెండు, మూడు జిల్లాల పరిధిలో ఉండటం, మండలాలు జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండటం వంటి సమస్యలు తెరమీదకు వచ్చాయి. వీటి విషయంలో పలు విజ్ఞప్తులు వచ్చినప్పటికీ నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించింది. గతంలో విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. అనుకున్నట్లే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. తాజాగా శాసనసభలోనూ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ విషయంపై మరింత స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన మార్పులు, చేర్పులు చేయాలన్న దానిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు.
జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు
రాష్ట్రంలో పాలనాపరంగా సమస్యాత్మకంగా ఉన్న పలు రెవెన్యూ డివిజన్లు, మండలాల విషయంలో ప్రభుత్వ తక్షణ చర్యలు ప్రారంభించడానికి సిద్ధమైంది. కొన్ని మండలాలు.. రెండు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉండటం, కొన్ని శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గాలు రెండు మూడు జిల్లాల పరిధిలో ఉండటంతో పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి పనుల అమలు, నిధుల కేటాయింపు సమయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో డివిజన్, మండలం, నియోజకవర్గం ఏదైనా ఒకే జిల్లా పరిధిలో ఉండేలా.. లేదంటే ఒకే పార్లమెంట్ పరిధిలోకి వచ్చేలా మార్పులు అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో ముఖ్యమంత్రి కూడా ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. అన్ని కూడా శాస్త్రీయంగా ఏర్పాటు చేయడానికి జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
నాటి విభజన ఇలా..
రాష్ట్ర విభజన నాటికి 10 జిల్లాలు 48 రెవెన్యూ డివిజన్లు, 466 మండలాలు ఉండేవి.రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016, అక్టోబరులో తొలిసారి పునర్‌వ్యవస్థీకరణ చేపట్టారు. 31 కొత్త జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చిన డిమాండ్లను పరిగణలోకి తీసుకుని 2020, 21లలో నారాయణపేట, ములుగు జిల్లాలను, మరికొన్ని మండలాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం 12 రెవెన్యూ డివిజన్లు, 25 మండలాలను నూతనంగా ఏర్పాటు చేయాలని కొత్తగా విజ్ఞప్తులు వచ్చాయి. కొన్ని మండలాల్లో గ్రామాల విభజన శాస్త్రీయంగా లేదని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. పక్కనే మండల కేంద్రం ఉన్నప్పటికీ ఎక్కడో దూరంగా ఉన్న మండలంలో కలపడం, ఒక జిల్లా పరిధిలోని మండలం వేరే జిల్లా పరిధిలో ఉన్న నియోజకవర్గంలోకి చేరడం లాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. జడ్పీ సమావేశాలు, అభివృద్ధి పనుల కేటాయింపు సమయంలో ఇద్దరు, ముగ్గురు కలెక్టర్లు, జిల్లా అధికారులను సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సమస్యలు ఇలా...
కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత జోనల్ వ్యవస్థను నూతనంగా అమల్లోకి తీసుకు వచ్చారు. రంగారెడ్డి జిల్లా నుంచి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోకి చేరిన గండీడ్, మహ్మదాబాద్ మండలాల్లో సమస్యలు తలెత్తాయి. కరీంనగర్ జిల్లా నుంచి హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్, బెజ్జంకి మండలాలను సిద్ధిపేట జిల్లాలో కలిపారు. దీంతో జిల్లా కేంద్రానికి చాలా దూరం పెరిగింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తిరిగి కరీంనగర్‌లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక
నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్లతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పలు మండలాల్లో పాలనాపరంగా సమస్యలున్నట్లు విజ్ఞప్తులు వచ్చాయి. నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం రాష్ట్రాన్ని రెండు బహుళజోన్లు, ఏడు జోన్లుగా ప్రభుత్వం విభజించింది. దీనిప్రకారం ఉద్యోగుల నియామకం, పదోన్నతులు చేపడుతున్నారు. ఇప్పుడు పునర్‌వ్యవస్థీకరణ చేస్తే జోన్లలోనూ మార్పులు చేయాల్సి వస్తుంది.
కేంద్రం అనుమతి తప్పనిసరి
కాగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు పలు జిల్లాలకు కొత్తగా పేర్లు కూడా పెట్టారు. నాటి విభజన సందర్భంలో అన్ని అనుమతులతో జిల్లాల పునర్ వ్యవస్తీకరణ జరిగింది. అయితే తిరిగి విభజన చేయాలన్నా, పేర్లు మార్చాలన్నా రైల్వే, పోస్టల్, సర్వే ఆఫ్ ఇండియా తదితర సంస్థల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన జనగణనను ఈ ఏడాది నాటికి పూర్తి చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసేంతవరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల్లో రాష్ట్రాలు మార్పులు చేయడం కుదరకపోవచ్చు. అలా చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్రం అభిప్రాయపడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మార్పులు చేస్తే కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Follow Us