Telangana: తెలంగాణ మహిళలకు ఈ దసరా సందర్భంగా రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఇచ్చిన చీరలకు బదులు మరో కానుక ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఇప్పటికే రూపొందించారని, వారం రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ చేసిన తప్పులు చేయకుండా..
బతుకమ్మను ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే ఆడపడుచులకోసం గత ప్రభుత్వం చీరల పంపిణీ చేసింది. అయితే చీరల నాణ్యత, తదితర విషయాలు వివాదాలు, విమర్శలకు దారితీశాయి. అర్హులైన వారికి కాకుండా నచ్చిన వారికే చీరలు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ గొడవలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త కానుక ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. బీఆర్ఎస్ చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతోంది. ఈ క్రమంలోనే చీరల పంపిణీ సంప్రదాయానికి స్వస్తిపలికి.. చీరల స్థానంలో అర్హులైన మహిళలకు రూ.500 చొప్పున నగదు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. చీరలకంటే మహిళలకు డబ్బులు ఇవ్వడమే సరైన నిర్ణయంగా ప్రభుత్వం యోచిస్తోంది. నగదు ఇస్తే పండగ ఖర్చులకు ఉపయోగపడతాయని, పలువురి అభిప్రాయాలను సైతం సేకరించి తుది నిర్ణయానికి వచ్చిందట.
అయితే ఈ డబ్బులు నేరుగా అందించాలా? బ్యాంకు ఖాతాల్లో వేయాలా? అనే అంశంపై అధికారులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నగదు డ్వాక్రా మహిళలకు ఇవ్వాలా? తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కూడా ఇవ్వాలా అనే దానిపై స్పష్టత రావాల్సివుంది. ఈ వారం రోజుల్లోనే కానుక విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read : సెప్టెంబర్ 30 తర్వాత చూసుకుందాం.. పవన్ కు ప్రకాష్ రాజ్ వార్నింగ్