/rtv/media/media_files/2025/12/02/fotojet-2025-12-02t072923844-2025-12-02-07-30-19.jpg)
samntha raj nidimoru marriage
Raj Nidimoru: సమంత - రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడిగా రాజ్ నిడిమోరు అందరికీ సుపరిచితమే. అయితే సమంతతో పెళ్లి అనగానే అతని గురించి సోషల్‌మీడియాలో వెతుకుతున్నారు. నిజానికి ఆయన ఫ్యామిలీ నేపథ్యం చాలామందికి తెలియదు. అందుకే ఆయన కుటుంబ నేపథ్యం ఏంటీ అని సెర్చ్ చేస్తున్నారు. ఆయన మన తెలుగువాడే. అందులోనూ తిరుపతికి చెందినవాడు. ఆయన తల్లిపేరు రమాదేవి.. ఆమె ఎస్పీడబ్ల్యూ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. తండ్రి రామకృష్ణ ఎస్వీ డైరీ ఫామ్ ఉద్యోగి అని తెలుస్తోంది. రాజ్ పూర్తి పేరు రాజేశ్ నిడిమోరు. తిరుపతి కేజెక్స్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన రాజ్ ఆ తర్వాత పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి విద్యా సంస్థల్లో ఇంటర్ పూర్తి చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నారు. 1994లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన రాజ్ కొన్నాళ్లు అమెరికాలో ఉద్యోగం చేశారు. రాజ్‌కు సినిమాలపై ఉన్న ఆసక్తితో స్నేహితుడు డీకేతో కలిసి ఇండస్ట్రీలోకి వచ్చారు.
ఇక రాజ్- డీకే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రూపొందించిన తొలి సినిమా ‘ఫ్లేవర్స్’ (2003). తర్వాత ‘99’. ‘గో గోవా గాన్’, ‘హ్యాపీ ఎండింగ్’ తదితర సినిమాలు చేశారు. 2019లో వీరు తొలిసారి ‘ది ఫ్యామిలీమ్యాన్’ (The Family Man) పేరుతో ఓటీటీలో వీరు తొలి వెబ్‌సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్ ప్రేక్షకుల విశేష ఆదరణ దక్కించుకుంది. దర్శకులుగా వారికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’, మరో సిరీస్ ‘సిటడెల్: హనీ బన్నీ’ తదితర వెబ్‌సిరీస్‌లలో సమంత కీలక పాత్రలు పోషించింది. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో రాజ్, సమంతల మధ్య మొదలైన స్నేహం.. ఇప్పుడు వారిని ఒక్కటి చేసింది.
కాగా చాలా కాలంగా సమంత - రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దాన్ని వారిద్దరూ ఖండించలేదు. ఈ నేపథ్యంలోనే రాజ్‌తో సమంత క్లోజ్‌గా ఉన్న ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. సమంత నిర్మించిన ‘శుభం’ చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేయడం విశేషం. ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో వీరి ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా వివాహ ఫొటోలు ఆమె షేర్ చేయడంతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా ఇటీవల సమంత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో.. గత ఏడాదిన్నరగా నా కెరీర్‌లో సాహసోపేతమైన అడుగులు వేశా. రిస్క్ తీసుకున్నా. ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నా. చిన్న విజయాలను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నా. ప్రతిభావంతులైన, కష్టపడి పనిచేసే వారితో కలిసి వర్క్ చేస్తున్నందుకు కృతజ్ఞురాలిని. ఇది కేవలం ఆరంభమే’’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో పాటు ఆమె రాజ్ నిడిమోరుతో ఉన్న ఫొటో పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. వీరి వివాహం నేపథ్యంలో అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
Follow Us