/rtv/media/media_files/2026/03/04/banjarahills-2026-03-04-20-02-13.jpg)
Adulterated ghee
Adulterated ghee : .హోటల్స్, ఫంక్షన్లకు వెళ్లిన సమయంలో అక్కడ నెయ్యి కనపడగానే భోజనంలో వేసుకుని తింటున్నారా? లేదంటే నెయ్యి విక్రయ కేంద్రాలకు వెళ్లినపుడు ఆవునెయ్యి, గేదె నెయ్యి అని కనపడగానే కొని తెచ్చుకుంటున్నారా? అయితే మీరు పొరపడినట్లే.. మనం తింటున్నది, కొని తెచ్చుకుంటున్నది నెయ్యి కాదంటే నమ్ముతారా? కానీ, ఇది నిజం. తక్కువ నాణ్యత కలిగిన పామ్ ఆయిల్, డాల్డాతో పాటు కొన్ని హానికరమైన పదార్థాలను కలిపి వాటికి ఆవు, గేదె మీగడలో కలిపి నెయ్యిని తయారు చేస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు. కానీ, అక్రమ సంపాదనకు అలవాటు బడిన ఓ నిందితుడు ఇలా కల్తీ నెయ్యి తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాడు. కాగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో తయారీ యూనిట్ పై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ అధికారులు కల్తీ నెయ్యితో పాటు నిందితున్ని అరెస్ట్ చేశారు.
టాస్క్‌ఫోర్స్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని భోలానగర్ లో మహ్మద్ జునైద్ అనే యువకుడు ప్రైడ్ డెయిరీ పేరుతో నెయ్యి తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. నిందితుడు మహ్మద్ జునైద్ హుస్సేన్ తన ప్రైడ్ డెయిరీ యూనిట్‌లో నెయ్యి తయారు చేయడానికి లైసెన్స్ కలిగి ఉన్నప్పటికీ.. అక్రమ సంపాదన కోసం కల్తీ నెయ్యి తయారీకి శ్రీకారం చుట్టాడు. సమాచారం మేరకు దాడులు చేసిన అధికారులు అక్కడ కల్తీ నెయ్యి తయారవుతున్నట్లు గుర్తించారు.తయారీ కేంద్రంలో భారీ ఎత్తున కల్తీ నెయ్యిని తయారు చేసి హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లు, శుభకార్యాలు, ఫంక్షన్లకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మాసబ్ ట్యాంక్ పోలీసులు.. సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆ కల్తీ నెయ్యి తయారు కేంద్రం నుంచి నెయ్యి కల్తీ కోసం ఉపయోగిస్తున్న 28 డబ్బాల రుచి గోల్డ్ డాల్డా, ఇతర కాళీ డబ్బాలు , ఆయిల్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.18.26 లక్షల విలువ గల 460 కిలోల కల్తీ నెయ్యి..భారీ స్థాయిలో కల్తీకి ఉపయోగించే ముడి పదార్థాలను సీజ్ చేశారు. 2,090 కిలోల ఆవు మీగడ, 1,170 కిలోల గేదె మీగడను అధికారులు పట్టుకున్నారు. తయారు చేయడానికి ఉపయోగిస్తున్న రెండు బాయిలర్లు, ఒక పుషింగ్ మిషన్, ఒక ప్యాకింగ్ మిషన్, రెండు వేయింగ్ మిషన్లు, నెయ్యి నిలువ ఉంచిన 70 వివిధ రకాల చిన్న పెద్ద బేసిన్లు ,ప్యాకింగ్ కవర్లు సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడిన నిందితుడు మహమ్మద్ జునైద్ హుస్సేన్ పై BNS సెక్షన్లు 318(4), 274, 275 కింద కేసు నమోదు చేశారు. కల్తీలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని తీవ్ర హెచ్చరికలు చేశారు.
Follow Us