ప్రతి కుటుంబానికి డిజిట‌ల్ కార్డు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి డిజిట‌ల్ కార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రేష‌న్‌, ఆరోగ్యశ్రీతోపాటు ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలన్నింటికి ఒకే కార్డు ద్వారా అందించేలా విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు.

New Update
CM revanth

TG NEWS: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలి డిజిట‌ల్ కార్డు ఇవ్వాల‌ని రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేష‌న్‌, ఆరోగ్య, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలన్నింటిని ఒకే కార్డు ద్వారా అందించాల‌నే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం త‌న నివాసంలో ఈ అంశంపై వైద్యారోగ్య, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. కుటుంబాల స‌మ‌గ్ర వివ‌రాల న‌మోదుతో ఇప్పటికే రాజ‌స్థాన్, హ‌ర్యానా, క‌ర్ణాట‌క రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయ‌నం చేయాల‌ని, వాటితో క‌లుగుతున్న ప్రయోజ‌నాలు, ఇబ్బందుల‌పై అధ్యయ‌నం చేసి ఒక స‌మ‌గ్ర నివేదిక రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 

అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందేలా..

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఒక ప‌ట్టణ‌, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని పైలెట్ ప్రాజెక్టు కింద ఈ ఫ్యామిలి డిజిటల్ కార్డుల‌కు సంబంధించి కార్యాచ‌ర‌ణ ప్రారంభించాల‌ని రేవంత్ సూచించారు. అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందేలా ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులు ఉండాల‌ని, ఈ కార్డుల‌తో ల‌బ్ధిదారులు ఎక్కడైనా రేష‌న్‌, ఆరోగ్య సేవ‌లు పొందేలా ఉండాల‌ని తెలిపారు. ఈ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులో ప్రతి కుటుంబ స‌భ్యుని హెల్త్ ప్రొఫైల్ ఉండాల‌ని, అది దీర్ఘకాలంలో వైద్య సేవ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అధికారులకు సూచించారు. ఆయా కుటుంబ స‌భ్యులు త‌మ కుటుంబాల్లో స‌భ్యుల క‌ల‌యిక‌, తొల‌గింపున‌కు సంబంధించి ఎప్పటిక‌ప్పుడు కార్డును అప్‌డేట్ చేసుకునేలా ఉండాల‌న్నారు. 

ఈ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల వ్యవ‌స్థ మానిట‌రింగ్ కు జిల్లాలవారీగా వ్యవస్థల‌ను ఏర్పాటు చేయాల‌ని అధికారులను ఆదేశించారు. స‌మావేశంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యద‌ర్శి అజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యద‌ర్శులు చంద్రశేఖ‌ర్‌రెడ్డి, సంగీత స‌త్యనారాయ‌ణ‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ డీఎస్ చౌహాన్‌, ఆరోగ్య శాఖ కార్యద‌ర్శి క్రిస్టియానా జ‌డ్ చోంగ్తూ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు