Medaram : జనసంద్రమైన మేడారం..అమ్మల రాకతో పోటెత్తిన భక్తులు

భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క చిలుకల గుట్ట మీద నుంచి కదలివచ్చింది. అమ్మ రాకను వీక్షించేందుకు జనం పెద్ద ఎత్తున మేడారం చేరుకోవడంతో జాతర జనసంద్రంగా మారింది. ఆ తల్లికి గౌరవ సూచకంగా ములుగు ఎస్పీ సుధీర్‌ ఏకే 47తో గాల్లోకి 4 రౌండ్లు పేల్చి వందనం సమర్పించారు.

New Update
FotoJet (84)

.Devotees flock to Amma's arrival

Medaram : కోట్లాది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క చిలుకల గుట్ట మీద నుంచి కదలివచ్చింది. అమ్మ రాకను వీక్షించేందుకు కోట్లాది మంది భక్తులు మేడారం చేరుకోవడంతో జాతర ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. బుధవారం సారక్క, పగిడిద్దరాజు గద్దెల మీదకు చేరుకుని సమ్మక్క రాకకోసం ఎదురు చూశారు. కాగా గురువారం సమ్మక్క తల్లి! తనను నమ్ముకున్న భక్తుల కష్టాలను తీర్చేందుకు చల్లని పున్నమి వెన్నెల కాంతుల నడుమ మేడారం గద్దెపై ఆసీనురాలైంది. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మరాకకు పులకరించిపోయిన భక్తజనం సమ్మక్క తల్లి చల్లంగా చూడమ్మా అంటూ చేతులెత్తి వేడుకున్నారు. డోలూ సన్నాయి వాయిద్యాలు, శివసత్తుల పూనకాల నడుమ సరిగ్గా రాత్రి 9:47 గంటలకు సమ్మక్క గద్దెపైకి చేరుకుంది.సమ్మక్క రాకతో జాతర పరిపూర్ణతను సంతరించుకుంది. 

FotoJet (81)

సమ్మక్కను గద్దెపైకి చేర్చే కార్యక్రమంలో గిరిజన పూజారులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు మొదలు పెట్టారు. మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకొని ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. పేడతో చక్కగా అలికి.. తోరణాలు కట్టి.. ముగ్గులు వేశారు. అడవికి వెళ్లి వనాన్ని తీసుకొచ్చారు. ఉదయం 9 గంటలకు డప్పుచప్పుళ్ల మధ్య వనాన్ని తీసుకొస్తుండగా సమ్మక్క గుడి సమీపంలో బొడ్రాయి వద్ద మహిళలు నీళ్ల బిందెలతో ఎదురొచ్చి పూజారుల కాళ్లు కడిగారు. మంగళహారతులు పట్టారు. మధ్యాహ్నం పూజారి సిద్దబోయిన మునిందర్‌ ఇంట్లో ఆడేరాలను (పసిడి కుండలు) తయారు చేశారు. డోలు వాయిద్యాల మధ్య వాటిని సమ్మక్క గుడికి తరలించారు. గుడిలో తల్లికి సంబంధించిన మిగతా పూజా సామగ్రిని శుద్ధి చేశారు. పూజల అనంతరం మేకలు, కోళ్లను బలిచ్చారు.

FotoJet (78)

అనంతరం సాయంత్రం ఐదింటికి ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్యతో పాటు పూజారులు మాల్యాల సత్యం, సిద్దబోయిన మునీందర్‌, సిద్దబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్దన్‌.. చిలుకల గుట్టకు బయలుదేరారు. గుట్టపైకి కొంత దూరం వెళ్లాక మిగతా వారు ఆగిపోగా..  ప్రధాన పూజారి కృష్ణయ్య ఒక్కరే గుట్ట పైభాగాన ఉన్న సమ్మక్క తల్లి స్థావరానికి వెళ్లారు. అక్కడ సుమారు రెండు, మూడు గంటల పాటు ఆయన రహస్య పూజలు చేశారు. ఆ తర్వాత తల్లి రూపమైన కుంకుమ భరిణను తీసుకొని బయలుదేరారు. మార్గమధ్యలో వేచివున్న మిగతా పూజారులతో కలిసి కిందకు దిగారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకొస్తుండగా  ఆ తల్లికి గౌరవ సూచకంగా ములుగు ఎస్పీ సుధీర్‌ ఏకే 47తో గాల్లోకి నాలుగు రౌండ్లు పేల్చి వందనం సమర్పించారు. అనంతరం చిలుకల గుట్ట ప్రధాన ద్వారం వద్ద మరోదఫా మూడు రౌండ్లు గాల్లోకి పేల్చారు. సమ్మక్కను పూజారులు మొదట మేడారంలోని ఆమె గుడికి తీసుకువెళ్లారు. అక్కడ ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సమ్మక్కను గద్దెకు తీసుకువచ్చే క్రమంలో దారి పొడవునా వేలాది మంది భక్తులు బారులు అమ్మకు స్వాగతం పలికారు. నిల్చున్నారు. సమ్మక్క రాక సందర్భంగా జాతర యావత్తు సిగమూగింది. తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. సమ్మక్కను గద్దెపై నిలిపిన తర్వాత పది నిముషాల పాటు రహస్య పూజలు నిర్వహించి వెనుదిరిగిన తర్వాత తల్లి దర్శనానికి అనుమతిచ్చారు.

FotoJet (82)

సమ్మక్క రాకతో ప్రధాన జాతర మొదలవ్వంగా జాతర జనసంద్రంగా మారింది. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో 25 మంది ఐపీఎస్‌ అధికారులు విధుల్లో పాల్గొన్నారు. తల్లుల దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులకు కనీసం రెండు గంటల సమయం పట్టింది. మరోవైపు జంపన్నవాగు వద్ద లక్షల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పెద్ద సంఖ్యలో తలనీలాలు సమర్పించుకొన్నారు. ఈ నేపథ్యంలో మేడారం మొత్తం గుడారాల మయమైంది. 

నేడు గవర్నర్‌ రాక

శుక్రవారం గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ... మేడారంలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం నుంచే మేడారంలో ప్రముఖుల సందడి మొదలైంది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు తల్లులను దర్శించుకొని ఎత్తుబంగారం సమర్పించుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు