/rtv/media/media_files/2025/12/18/tg-2025-12-18-09-43-35.jpg)
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిసాయి. 31 జిల్లాల్లోని 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు 3 విడతల్లో పోటాపోటీగా ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో BRS గెలుపొందింది. బీజేపీ 688 స్థానాలు పొందగా... ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది.
కాంగ్రెస్ పార్టీ జోరు
మొదటి, రెండో విడతల్లో సుమారు 56 శాతం స్థానాలను గెలిచిన పార్టీ మూడో విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. చివరి విడత సర్పంచ్ ఎన్నికల్లో బుధవారం మొత్తం 4,159 స్థానాలకు జరిగగా.. ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 2,286 స్థానాలను గెలిచారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సీపీఐ మద్దతుదారులు 24 చోట్ల, సీపీఎం వారు 7 చోట్ల గెలిచారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. నవంబర్ 25 నుంచి మొదలైన ఈ ఎన్నికల ప్రక్రియ బుధవారంతో ముగిసింది.
పోలింగ్ శాతం..
నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యాలను పొందింది. మూడో విడతలో 85.77 శాతం పోలింగ్ నమోదైంది. రెండోవిడత కంటే ఇది 0.9 శాతం తక్కువ. మూడు విడతల్లో కలిపి 85.30 శాతం ఓట్లు పోలయ్యాయి. మూడో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలోనే పోలింగ్ అత్యధికంగా 92.56 శాతం నమోదైంది. ఇక్కడ మహిళలు (92.33) శాతం కంటే పురుషులు (92.79 శాతం) ఎక్కువగా ఓటేశారు. నిజామాబాద్‌లో అత్యల్పంగా 76.45 శాతం పోలింగ్ నమోదైంది. మూడో విడతలో మొత్తం ఓటర్లు 50,56,334 మందికి గాను 43,37,024 (85.77 శాతం) ఓట్లు పోలయ్యాయి. వారిలో మహిళా ఓటర్లే అధికం.
రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మినహా అన్నిచోట్ల ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. నిర్మల్ జిల్లా ముథోల్‌లో 10,232 మంది ఓటర్లు ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు 500 మంది వరకు ఓటర్లు వివిధ వార్డుల్లో వరుసలో ఉన్నారు. ఇక్కడ మధ్యాహ్నం 2.30 గంటలకు పోలింగ్ ముగిసింది. మూడో విడత పోలింగ్ సరళిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినిలు వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు.
Follow Us