/rtv/media/media_files/2026/01/27/congress-2026-01-27-12-03-10.jpg)
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా.. నలుగురు కీలక నేతలు ప్రజా భవన్‌లో సుమారు 3 గంటల పాటు రహస్యంగా సమావేశం కావడం సంచలనం సృష్టిస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్రంలో దుమారం రేపుతున్న బొగ్గు స్కామ్ (నైనీ బ్లాక్ వ్యవహారం) వరుస కథనాల నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీలోని సీనియర్ నేతల మధ్య సమన్వయం లేదా భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగినట్లు సమాచారం.
హైకమాండ్ సీరియస్: రంగంలోకి మహేష్ కుమార్ గౌడ్
నైనీ బ్లాక్ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనం. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరడం చర్చకు దారితీసింది. పార్టీలోని కొందరు నేతలు తమ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని, కొత్తగా చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇప్పటికే కొందరు మంత్రులు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీ పర్యటన
పరిస్థితులు అదుపు తప్పకముందే చక్కదిద్దాలని హైకమాండ్ భావిస్తోంది. బొగ్గు స్కామ్‌తో పాటు HILT స్కామ్ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులను ఢిల్లీకి రావాలని ఆదేశించినట్లు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటన తర్వాత మంత్రివర్గంలో లేదా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Follow Us