Jubilee Hills Bypoll Result : జూబ్లీహిల్స్ పై రేవంత్ 6 అస్త్రాలు.. కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన కారణాలివే!

తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను కైవసం చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆరు వ్యూహాలను అమలు చేశారు.

New Update
CM Revanth

CM Revanth

తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను కైవసం చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆరు వ్యూహాలను అమలు చేశారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల సామాజిక సమీకరణ, సినీ పరిశ్రమ ప్రాబల్యం, స్థానిక సమస్యలపై దృష్టి సారించి సీఎం రేవంత్ రెడ్డి తన ప్రచారాన్ని పరుగులు పెట్టించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ వర్గం ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు, కాంగ్రెస్ పార్టీ స్థానికంగా పట్టున్న బీసీ అభ్యర్థి నవీన్ కుయార్ ని బరిలోకి దింపింది. ఈ నిర్ణయం ద్వారా నియోజకవర్గంలోని స్థానికత, సామాజిక న్యాయం అనే సెంటిమెంట్‌ను బలంగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావించింది.

జూబ్లీహిల్స్‌లో లక్షకు పైగా ముస్లిం ఓటర్లు ఉండడంతో, వీరి మద్దతు గెలుపుకు అత్యంత కీలకం అయింది. ప్రచారం జరుగుతున్న కీలక సమయంలోనే ప్రముఖ క్రికెటర్, రాజకీయ నాయకుడైన మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీల వైపు తమవైపు తిప్పుకుంది. దీంతో ముస్లిం ఓటర్లను ఏకతాటిపైకి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు సీఎం రేవంత్ 

ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు హామీ

ఇక ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న సెటిలర్స్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. దీనిలో భాగంగా తెలుగువారి ఆరాధ్యదైవం అయిన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు హామీ ఇవ్వడం ద్వారా వారి సెంటిమెంట్‌ను ప్రభావితం చేయాలని చూశారు. దీని ద్వారా టీడీపీ శ్రేణులు -కూడా ఓ రకంగా కాంగ్రెస్ కు మద్దతు పలికారని చెప్పవచ్చు. 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం సినీ పరిశ్రమకు కేంద్రంగా ఉంది. సినీ కార్మికులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తుంటారు. అందుకే సీఎం సినీ కార్మికులు, పెద్దలతో వరుస సమావేశాలు నిర్వహించారు. వారి సమస్యలపై తమకున్న శ్రద్ధను చూపించి కీలక హామీలిచ్చారు. 

ఈ నియోజకవర్గంలో అనేక బస్తీలు, మురికివాడలు కూడా ఉన్నాయి. గత పదేళ్లలో అభివృద్ధి జరిగితే బస్తీల్లో సమస్యలు ఎందుకు ఉంటాయని రేవంత్ రెడ్డి ఓటర్లను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి, బస్తీల్లోని పేద, మధ్య తరగతి ఓటర్లను ఆకర్షించారు.

సీఎంగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గంలోని ఒక్కో డివిజన్‌కు బాధ్యతలు అప్పగించి, సమన్వయం చేశారు. అంతేకాక ఆయనే  స్వయంగా రోడ్ షోలు, ప్రెస్ మీట్లు, మీట్ ది ప్రెస్ వంటి కార్యక్రమాలను నిర్వహించి, ప్రచారాన్ని చివరి నిమిషం వరకు ఉధృతం చేశారు.  సర్వేల ఆధారంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ, కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం ప్రచారాన్ని పరుగులు పెట్టించారు.

Advertisment
తాజా కథనాలు