CM Revanth Photo: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అమ్మకానికి పెట్టడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం ఉంచాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫొటో సైజు(20x24)ను కూడా ప్రభుత్వమే ఖరారు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా పంచాయతీ కార్యదర్శుల వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది.
రూ.1600 చెల్లించి...
రూ.1600 చెల్లించి ప్రభుత్వ కార్యాలయాల్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని ఆదేశాలు వచ్చాయని చెప్పి కొందరు మండల అధికారులు సీఎం చిత్రపటానికి రూ.1600 వసూలు చేస్తున్నారు. నగదు చెల్లించి ఫొటోలు తీసుకుపోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశిస్తున్నారు. నగదు చెల్లించాలని వాట్సాప్‌లో పెడుతున్నట్లు తెలుస్తుంది. ఈ వార్త పంచాయతీ కార్యదర్శుల గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. పైస్థాయి అధికారులు ఆదేశించడంతో కార్యదర్శులు మౌనంగా ఉండిపోతున్నారు.
సీఎం ఫోటో లేదని ఫిర్యాదు...
ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను పెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7వ తేదీలోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటో ఏర్పాటు చేయాలని కోరింది. ఇందుకోసం రేవంత్ కొత్త ఫొటో నమూనాను కూడా విడుదల చేసింది. ఈ ఫొటోనే ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని ఆదేశించింది. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుతున్న ఇంకా కొన్ని కార్యాలయాల్లో సీఎం రేవంత్ ఫొటో లేదని కాంగ్రెస్ నేతలు నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : దసరా రోజు జమ్మిచెట్టును పూజిస్తే కలిగే లాభాలు