నిన్న జరిగిన మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి 95వ జయంతి వేడుకల సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తనకు వెంకటస్వామి ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను కూడా ఆ కుటుంబసభ్యుడినన్నారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. పొన్నం ప్రభాకర్ తాను ఆ కుటుంబంలో ఒకడినని అన్నారని.. అలా అయితే కాకా ఫ్యామిలీకి మంత్రి పదవి ఇచ్చినట్లే అవుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా ఓకేనా.. అంటూ సభకు హాజరైన వారిని అడిగారు. దీంతో కాదని.. వెంకటస్వామి ఫ్యామిలీకి మంత్రి పదవిని ఇవ్వాలన్నట్లుగా అక్కడ ఉన్నవారంతా సమాధానం ఇచ్చారు.
అప్పుడు అన్నకు.. ఇప్పుడు తమ్ముడికి ఛాన్స్?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వెంకటస్వామి ఫ్యామిలీకి మంత్రి పదవి పక్కా అన్న ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం వెంకటస్వామి పెద్దకుమారుడు వినోద్ బెల్లంపల్లి నుంచి, చిన్న కుమారుడు వివేక్ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే.. వినోద్ కు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మంత్రి పదవి దక్కింది. ఈ సారి వివేక్ కు మంత్రి పదవి ఖాయమని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి నిన్న వెంకటస్వామి ఫ్యామిలీకి మంత్రి పదవి అంశాన్ని ప్రస్తావించడంతో.. వివేక్ కు కేబినెట్ విస్తరణలో చోటు ఖాయమన్న చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. దసరాకు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు రేవంత్ రెడ్డికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.