CM Revanth: అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను అలయ్ బలయ్ ద్వారా దత్తాత్రేయ పునరుద్దరించడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికి, తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన ఆలస్యం అయినప్పుడు పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు అలయ్, బలయ్ స్ఫూర్తిగా ఉపయోగపడిందని సీఎం గుర్తు చేశారు. ఈ మేరకు ఆదివారం అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్.. గత 19 ఏళ్ల నుంచి దసరా సందర్భంగా రాజకీయాలకు అతీతంగా గౌరవింపబడే బలయ్ బలయ్ ను బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ సాధనలో కీలక పాత్ర..
ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పార్టీల వారీగా కార్యక్రమాలు జరిగేవి. తెలంగాణ ఉద్యమ సాధనలో అన్ని వర్గాలు కార్యోన్ముఖులై అడుగు ముందుకు వేయడానికి అలయ్ బలయ్ ఒక కారణం. తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ దసరా. దసరా అంటే పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వస్తాయి. అలయ్ బలయ్ అంటే గుర్తుకు వచ్చేది బండారు దత్తాత్రేయ. దత్తాత్రేయ వారసురాలిగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్న బండారు విజయలక్ష్మికి అభినందనలు. బండారు విజయలక్ష్మి దిగ్విజయంగా నిర్వహిస్తారన్న విశ్వాసం నాకుంది. మా ప్రభుత్వం, పార్టీ పెద్దలంతా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం మన బాధ్యత చెప్పాం. మేం అంతా ఒక్కటే అన్న సందేశాన్ని అలయ్ బలయ్ ద్వారా నాయకులు ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు.