Medaram Jatara : మేడారం జాతరకు కేంద్రం గుడ్ న్యూస్ .. మరో రూ.3.70 కోట్ల నిధులు విడుదల

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం అదనంగా రూ. 3.70 కోట్ల నిధులను విడుదల చేసింది.

New Update
medaram

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం అదనంగా రూ. 3.70 కోట్ల నిధులను విడుదల చేసింది. కేంద్ర పర్యాటక శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ నిధులను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం, జాతర ప్రాంతంలో అవసరమైన అభివృద్ధి పనుల కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రూ. 80 కోట్ల బడ్జెట్‌తో పనులు

మేడారం పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ట్రైబల్ సర్క్యూట్ పథకం కింద ములుగు, లక్నవరం, తాడ్వాయి, బొగత జలపాతం వంటి ప్రాంతాల అభివృద్ధికి దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో పనులు కొనసాగుతున్నాయి. దీనికి అదనంగా ఇప్పుడు విడుదల చేసిన నిధులు జాతర ఏర్పాట్లకు మరింత తోడ్పడనున్నాయి. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ద్వారా 30 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్రం రూ.140 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి దాదాపు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న ప్రభుత్వం, ఇప్పటికే రూ. 251 కోట్లకు పైగా నిధులను మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టింది. గద్దెల విస్తరణ, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహా జాతరను కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు