అధికారం తలకెక్కి, అహంకారంతో మేము రాజులం అని ఎవరైనా భావిస్తే వాళ్లకు గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంలో ఒకటైన సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో అధికారులను జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సిగ్గు ఉన్న ముఖ్యమంత్రి అయితే పదవికి రాజీనామా చేయాలన్నారు. వంద ఎకరాలు పునరుద్ధరణ చేయాలని సుప్రీంకోర్టు చెప్పడం విద్యార్థులు, ప్రొఫెసర్ల విజయం అని అభివర్ణించారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తాము చెప్పిన విషయాలను కరెక్ట్ అని చెప్పిందన్నారు. కంచె గచ్చిబౌలి భూములపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చెప్పిందన్నారు.
కేంద్రం చేతుల్లో రిపోర్ట్..
కంచె గచ్చిబౌలి భూముల రిపోర్ట్ కేంద్రం చేతుల్లో ఉందన్నారు. బీజేపీ మాటల పార్టీ కానీ..చేతల పార్టీ కాదన్నారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే కంచె గచ్చిబౌలి భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పత్తా లేడని ఎద్దేవా చేశారు. రోహిత్ వేముల చనిపోతే రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీకి రెండుసార్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ఇక్కడి నుండి మూటలు వెళ్తున్నాయని గుర్తు చేశారు. ఈ విషయంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం చెరువును తాకట్టు పెట్టిందని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చెప్పిందన్నారు. మోదీ డైలాగులు కొడితే సరిపోదన్నారు. కంచె గచ్చిబౌలి భూములపై బీజేపీ ఎమ్మెల్యేలు, ఏబీవీపీ వాళ్ళు ధర్నా చేశారన్నారు. అయితే.. కేంద్రం ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతోందని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయినవి AI వీడియోలు కాదని జస్టిస్ గవాయ్ చెప్పారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు గవాయ్ పై కూడా కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే అధికారులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. అధికారులు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి వస్తుందన్నారు. రీట్వీట్లు చేస్తే కూడా పోలీసు అధికారులు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి శిఖండి రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఫార్ములా ఈ కార్ రేసులో మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నానని తాను చెప్పానన్నారు. యజమాని కాకుండానే భూమిని తాకట్టు పెట్టి పది వేల కోట్లు అప్పు తేవడం తప్పు కాదా? అని ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసినందుకు టీజీఐఐసీని, సీఎంను కేంద్ర ప్రభుత్వం విచారించాలని డిమాండ్ చేశారు. ఈడీ అనే సంస్థను తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. నాడు సీబీఐను కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందన్నారు. నేడు బీజేపీ ఈడీని దుర్వినియోగం చేస్తోందన్నారు. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనన్నారు. ఈడీ మంచిదో, చెడ్డదో కాంగ్రెస్ చెప్పాలన్నారు.
(Ktr | telugu-news | telugu breaking news )