వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ రోజు సూర్యాపేటలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పాదయాత్ర ఉంటుందన్నారు. పాదయాత్ర కోసం ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం జిల్లా పర్యటనలు ప్రారంభమయ్యాయన్నారు. ఏడాది చివర వరకు పార్టీని బలోపేతం చేసే పనిపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Phone Tapping Case : హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు
ఈ రోజు సూర్యాపేటలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 27న వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు ప్రతీ గ్రామం నుంచి కార్యకర్తలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. వరంగల్ సభ తర్వాత మే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందన్నారు. కొత్త కమిటీలను పటిష్టంగా నిర్మించుకుందామన్నారు. గ్రామస్థాయి, వార్డు స్థాయి, బూత్ స్థాయి, రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుందామన్నారు. కష్టకాలంలో పార్టీనే నమ్ముకొని ఉన్న వారికే పెద్దపీట వేస్తామని.. వారికే అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు. చిన్న పెద్ద అనే తేడా పార్టీలో లేదన్నారు.
ఇది కూడా చదవండి: ఫ్యామిలీతో వెళ్లి మోదీని కలిసిన రఘునందన్.. బీజేపీ అధ్యక్ష పదవి ఫిక్స్?
పార్టీ ఆఫీసులే చైతన్య కేంద్రాలు..
పార్టీ ఆఫీసులను చైతన్య కేంద్రాలుగా మార్చుకొని కార్యకర్తలకు అద్భుతంగా శిక్షణ ఇస్తామన్నారు. చివరి సంవత్సరంలో ఏదో ఒక పథకం ఇచ్చినట్టు చేస్తే ప్రజలు తమనే మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా గులాబీ కార్యకర్తలే చెప్పాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే కేసీఆర్ లాగా ప్రతీ కార్యకర్త కథానాయకుడిలాగా విజృంభించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27 నాడు దానికి తొలి అడుగు పడాలన్నారు. ఈ సంవత్సరం అంతా బీఆర్ఎస్ పోరాటనామ సంవత్సరం కాబోతోందన్నారు..