BJP: తెలంగాణలో రేవంత్ సర్కార్ పై తెలంగాణ బీజేపీ చార్జిషీట్ రిలీజ్ చేసింది. ఏడాది పాలనలో రూ. 80వేల కోట్ల అప్పు చేశారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఈ మేరకు 'కాంగ్రెస్ గ్యారంటీల గారడీ 6 అబద్ధాలు.. 66 మోసాలు' పేరుతో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి ఈ చార్జిషీట్ విడుదల చేశారు. కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు.
ఊరూరా ప్రజలను నమ్మించి మోసం..
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పదేళ్ల పాటు నియంతృత్వపాలన కుటుంబపాలన అవినీతి పాలన సాగిస్తే అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని స్వయంగా సోనియా గాంధీ కరపత్రాల రూపంలో ఇంటింటికి చేర్చారు. కానీ ఈ ఏడాది కాలంలో మీరిచ్చిన హామీలు ఏవీ కూడా అమలు కాలేదు. డిసెంబర్ 7న అధికారంలోకి వస్తాను, డిసెంబర్ 9వ తేదీన రైతుల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గతేడాది ఎన్నికలకు ముందు ఊరూరా ప్రజలను నమ్మించారు. కానీ ఈ ఏడాది కాలంలో హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.
ప్రజలు ఆశ్చర్యపోతున్నారు..
కాంగ్రెస్ విజయోత్సవాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. విజయోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మిగతా పార్టీల మాదిరిగా మేం భాధ్యతారాహిత్యంగా విమర్శలు చేయడం లేదని ప్రభుత్వానికి ఏడాది కాలం పాటు గడువు ఇచ్చాం. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన పనులతో పాటు ఏడాదిలోపు మొదలు పెడతామన్న పనుల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని వాటిని ప్రజల ముందు పెడుతున్నామన్నారు. గ్యారెంటీలు, డిక్లరేషన్ పేరుతో ఆయావర్గాలను నమ్మించిందో ఆ ఆంశాలపై తెలంగాణ ప్రజల పక్షాన చార్జిషీట్ రూపంలో విడుదల చేస్తున్నామని చెప్పారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందే..
ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసలు, అరెస్టులు, లాఠీచార్జీలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడాలేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ తో సమానంగా సీట్ల వచ్చాయని అందువల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత మాపై ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై విమర్శలు చేయాలంటే రెండు రోజులు పడుతుంది. రుణమాఫీ అసంపూర్ణంగా అమలైందన్నారు. రైతుభోరో పేరుతో తెలంగాణ రేతులకు వెన్నుపోటు పొడిచింది. పండించిన పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం వరికి మాత్రమే ఇవ్వడం ఏంటని నిలదీశారు. దోపిడీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందేనని బీజేపీ విమర్శించింది. మారింది పాలకులే కానీ పాలన, ప్రజల బతుకులు మారలేదని విమర్శించారు.