హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్ ముట్టడికి బీజేపీ నాయకులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిసెంబర్ 7 మంగళవారం మధ్యాహ్నం బీజేపీ శ్రేణులు గాంధీభవన్‌పైకి రాళ్లు విసురుతూ.. ముట్టడికి ప్రయత్నించారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. బారికేట్లను తోసుకుంటూ ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీ భవన్ ఆఫీస్ మీదకు రాళ్లు విసిరారు. బీజేపీ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ దాడికి నిరసనగా ఈ ముట్టడి చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ పై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడి చేసిన విషయం తెలిసిందే.. మంగళవారం ఉదయం నాంపల్లిలో కాంగ్రెస్ ,బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తుల బీజేపీ కార్యాలయంపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తల వెంటపడ్డారు. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటనకు నిరసనగా బీజేపీ శ్రేణులు గాంధీభవన్ పై దాడికి దిగారు. ఇరు పార్టీ కార్యాలయాల ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.