/rtv/media/media_files/2025/10/08/ts-2025-10-08-19-09-02.jpg)
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆశావహులకు రోజుకో సినిమాను చూపిస్తున్నాయి. రిజర్వేషన్ల అంశంపై ఎటూ తేల్చకపోవడంతో ఏం చేయాలో తెలియక పోటీ చేయాలనుకుంటున్న వారు తర్జన భర్జన పడుతున్నారు. అటో ఇటో ఏటో తెల్చుకోలేని పరిస్థితుల్లో పాపం వాళ్లు పడిపోయారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రేవంత్ సర్కార్ జీవో తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ప్రభుత్వం బిల్లు తీసుకురాగా అది రాష్ట్రపతి పరిశీలనలో ఉండిపోయింది. ఆ తర్వాత పంచాయతీ రాజ్ చట్టంలో సవరణ చేయగా.. గవర్నర్ వద్ద ఫైల్ పెండింగ్ లో ఉండిపోయింది. దీంతో జీవో నెంబర్ 9తో ఎన్నికలకు సిద్ధమైంది కాంగ్రెస్ సర్కార్. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఆర్.కృష్ణయ్య, వి.హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. అన్ని పిటిషన్లను కలిపి సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
సెప్టెంబర్ 27న హైకోర్టు ముందుగా దీనిపై విచారణ చేపట్టి అనంతరం అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఆ సమయంలో షెడ్యూల్ విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 29వ తేదీన ప్రకటించింది. అనంతరం సుప్రీంకోర్టులో పలువురి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ముందుగా హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్లకు సూచించింది. అలాగే ఎన్నికలపై స్టే ఇవ్వడానికి కూడా నో చెప్పింది సుప్రీం. దీంతో పిటిషనర్లు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుని హైకోర్టును ఆశ్రయించడానికి అనుమతి తీసుకున్నారు. ఈ పిటిషన్ తిరస్కరణ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది.
బీసీ రిజర్వేషన్‌ల పెంపుపై దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు... ఇరువైపులా వాదనలు విని రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు మరోసారి వాదనలు వింటామని వాయిదా వేసింది. స్థానిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. వారి విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రేపు ఈసీ షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:30 గంటలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అయితే రేపు ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందో అనే ఉత్కంఠ కూడా ఆశావహుల్లో ఉంది. ఈ రోజు ఏదో ఒకటి తేలితే పోటీ చేయాలా వద్దా అనే దానిపై ఓ నిర్ణయం తీసుకుందామని ఆశావహులు వేచి చూశారు. నేడు కూడా కోర్టు ఎటూ తేల్చకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ అమాంతం పెరిగిపోయింది.
తొందరపడి ఖర్చు పెడితే వేస్ట్
దీనికి తోడు ఈ జీవో చెల్లదంటూ ఎంపీ ఈటల లాంటి నేతలు, న్యాయవాదుల హెచ్చరికలు కూడా ఆశావహులను వెనుకడగు వేయిస్తున్నాయి. తొందరపడి ఖర్చు పెడితే వేస్ట్ అవుతుందని వారంతా భావిస్తున్నారు. ఈసీ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 11తో నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఆ టెన్షన్ కూడా ఆశావహుల్లో గట్టిగానే ఉంది. ఇలా ఎటూ తేల్చోకోలేక వారంతా తలలు పట్టుకుంటున్నారు. గతంలో మహారాష్ట్ర లాంటి పరిస్థితి తలెత్తి ఎన్నికైన తర్వాత న్యాయస్థానాలు కొట్టివేస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొత్తానికి రెండేళ్ల తరువాత కూడా వచ్చిన ఎన్నికలు కూడా ఆశవాహులను సంతోషంగా ఉంచడంలేదు.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ పిచ్చెక్కిస్తున్నాయి. రేపు హైకోర్టు వాయిదాలు వేయకుండా తీర్పు వెలువరిస్తే ఆశవాహుల్లో ఉత్సహం నెలకొంటుంది.