/rtv/media/media_files/2025/07/07/pongulti-srinivas-reddy-2025-07-07-21-17-27.jpg)
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ హైటెక్‌సిటీకి దగ్గరలో ఉన్న ఖాజాగూడలో దాదాపు 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టులో ఇటీవలే పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైడ్రాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను సోమవారం హైకోర్టు విచారణకు స్వీకరించింది. 27 ఎకరాల్లో నివాస సముదాయాల టవర్లు కడుతున్న బిల్డర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తున్నదానిపై ఉత్కంఠకు తెరపడింది. ఖాజాగూడ భూముల వెనుక మంత్రి పొంగులేటి హస్తం ఉందని.. అందుకే ప్రభుత్వం, హైడ్రా పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది. మంత్రి పొంగులేటితో ఉన్న విభేదాల కారణంగానే నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వేల కోట్ల భూములు కాపాడాలని కోర్టులో పిటిషన్ వేశారంటూ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని పాత సర్వే నెంబర్ 117/3/1లో ఉన్న 27.18 ఎకరాల ప్రభుత్వం భూమిని ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్ రెడ్డి, డాక్టర్ మురళీనాయక్‌లు హైకోర్టులో ఇటీవలే పిల్ వేశారు. సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ దీనిపై వాదనలు వినిపించారు. ఈ భూమిని రెవెన్యూ అధికారులు 1996లో సిఖందర్ ఖాన్, సలాబత్ ఖాన్ అనే వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారని పిటీషనర్లు తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. ఖాస్రా పహాణీ, సేత్వార్‌లో పోరంబోకు భూమిగా నమోదైనప్పటికీ, సర్వే నెంబర్లలో లోపాలను సరిదిద్దే పేరుతో కొత్త సర్వే నెంబర్‌ను ఏర్పాటు చేసి 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద అడంగల్ పహాణీలో నమోదు చేశారన్నారు. ప్రస్తుత సర్వే నెంబర్ 27లో ఉన్న ఆ భూమి తాజాగా బెవెర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, సోహినీ బిల్డర్స్ అధీనంలో ఉందని, అక్కడ ఒక్కో టవర్‌లో 48 అంతస్థులతో 8 టవర్లను నిర్మిస్తున్నారని తెలిపారు. ఖాజాగూడ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలున్నాయని, భవన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన రెడీమిక్స్ ప్లాంటును ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు 150 మీటర్ల పరిధిలోనే ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే దీనిపై మార్చిలో హైడ్రాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. 2023 జనవరిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నిరభ్యంతర పత్రాన్ని జారీ చేయడంతో దాని ఆధారంగా అదే ఏడాది మార్చి, 2024 అక్టోబర్‌లో జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందన్నారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, వేలకోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేలా సీఎస్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.
మంత్రితో ఎమ్మెల్యేలకు విభేదాలు..
హైకోర్టులో ఎమ్మెల్యేలు పిటిషన్ వేయడం వెనుక ఓ కీలక నేత ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటితో ఉన్న విభేదాల కారణంగానే నలుగురు ఎమ్మెల్యేలు ఆయనను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ భూముల వెనుక మంత్రి ఉన్నందునే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాస్త సైలెంట్ అయిన రేవంత్ కేబినెట్‌లోని మరో సహచర మంత్రే ఎమ్మెల్యేల వెనుక ఉండి పిటిషన్ వేయించారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ ఎటు దారితీస్తుందన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.