/rtv/media/media_files/2026/02/16/formula-e-car-race-2026-02-16-08-01-36.jpg)
Formula E-Car Race
Formula E-Car Race : గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలు వివాదస్పదం కాగా వాటికి సంబంధించి నాటి మంత్రులు, అధికారులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ర్టంలో ఫోన్ ట్యాపింగ్ కేసు కాకా రేపుతుండగా తాజాగా ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఈ వారమే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ నేరాభియోగ పత్రాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు.
కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ-కారు కేసు నమోదైంది. దీనిపై విచారణ దాదాపు పూర్తయింది. న్యాయస్ధానంలో చార్జిషీట్ దాఖలు చేయడమే మిగిలి ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. చార్జిషీట్‌కు ఏసీబీ అధికారులు ఇప్పటికే తుదిరూపం ఇచ్చారు. ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు డీవోపీటీ అనుమతి కోసం ఇన్నాళ్లు ఆగారు. తాజాగా డీవోపీటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి రావడంతో ఆ విషయాన్ని ప్రభుత్వం ఏసీబీకి తెలియజేసింది. దీంతో ఏసీబీ అధికారులు ఈ వారంలో చార్జిషీట్ దాఖలుకు కావాల్సిన అన్ని పత్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకు కీలకమైన పలు ఎలక్ర్టానిక్, డిజిటల్ సాక్ష్యాధారాలను సేకరించినట్లు తెలిసింది. ఫార్ములా ఈ-కారు రేసు వల్ల హెచ్‌ఎండీఏకు రూ.75.88 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ చెబుతోంది. ఈ విషయాన్ని రుజువు చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలను సేకరించింది.
ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఏస్ నెక్స్ట్‌జెన్ కంపెనీకి కారు రేసు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి రూ.45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు రావడం క్విడ్ ప్రొకోలో భాగమేనని ఏసీబీ తన చార్జిషీట్‌లో పొందుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గతేడాది నవంబరులో అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి 2024 డిసెంబరు 18న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది. ఈ మేరకు అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి, కేటీఆర్‌లను ఈడీ, ఏసీబీ అధికారులు ఒకసారి విచారించారు. చార్జిషీట్‌లో కేటీఆర్ తదితరులు నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యారని, ఇతరులకు లాభం కలిగించే విధంగా ప్రవర్తించారని ఏసీబీ అధికారులు చార్జిషీటులో పేర్కొనబోతున్నట్లు తెలుస్తోంది. దాని ఆధారంగా కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా? లేక విచారణ మరోసారి కొనసాగుతుందా అనేది తేలాల్సి ఉంది.
Follow Us